Lalit Modi: పుట్టుకతోనే నేను రూల్ బ్రేకర్.. అమెరికా కాలేజీలో అడ్మిషన్ కోసం ఫ్రాడ్ చేశా: లలిత్ మోదీ

Lalit Modi Reveals He Cheated To Pass SAT And Study In US
  • త‌న బదులు వేరొకరితో శాట్ పరీక్ష రాయించానన్న ల‌లిత్ మోదీ
  • పార్టీలు చేసుకోవడానికే అమెరికా వెళ్లాలనుకున్నానని వ్యాఖ్య
  • పుట్టుకతోనే తాను నిబంధనలు ఉల్లంఘించేవాడినన్న వ్యాపారవేత్త
  • కుటుంబంలో తానే బ్లాక్ షీప్‌గా ఉండేవాడినని వెల్లడి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపక ఛైర్మన్, వివాదాస్పద వ్యాపారవేత్త లలిత్ మోదీ తన గురించి సంచలన విషయాలు వెల్లడించారు. తాను కాలేజీలో చేరేందుకు పెద్ద మోసానికి పాల్పడ్డానని అంగీకరించారు. అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం 'శాట్' (స్కాలస్టిక్ అసెస్‌మెంట్ టెస్ట్) పరీక్షను తన బదులు వేరొకరితో రాయించానని బహిరంగంగా ఒప్పుకున్నారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌కు ఇచ్చిన ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"నేను వెండి స్పూన్‌తో కాదు, బంగారు స్పూన్‌తో కాదు.. ఏకంగా వజ్రాల స్పూన్‌తో పుట్టాను. పుట్టుకతోనే నాకు అన్నీ అందుబాటులో ఉండేవి. అయినా మా నాన్న, తాతయ్య నన్ను చాలా కఠినంగా పెంచారు. నేను మొదటి నుంచీ కుటుంబంలో ఒక బ్లాక్ షీప్‌లా ఉండేవాడిని. పుస్తకంలోని ప్రతి నిబంధనను ఉల్లంఘించేవాడిని. ఎందుకంటే నాకు ఇంకా, ఇంకా కావాలనిపించేది" అని లలిత్ మోదీ తెలిపారు.

అమెరికాలో పార్టీలు చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు. "అమెరికా వెళ్లాలంటే కాలేజీలో అడ్మిషన్ తప్పనిసరి. అందుకే నేను నా శాట్ పరీక్షను వేరొకరితో రాయించాను. అతడి ఫొటో, నా పేరుతో పరీక్ష రాయించాం. నాకు 1600 మార్కులకు 1560 వచ్చాయి. ఆ రోజుల్లో అది చెల్లిపోయింది. కానీ ఈ రోజుల్లో అలా సాధ్యం కాదు. అలా డ్యూక్ యూనివర్సిటీలో నాకు సీటు వచ్చింది" అని మోదీ ఆనాటి మోసాన్ని వివరించారు.

అమెరికాలో చదువుకునే రోజుల్లో తనను చాలామంది ఎగతాళి చేసేవారని గుర్తుచేసుకున్నారు. "ఇండియాలో కార్లకు బదులు ఎడ్లబండ్లు వాడతారా? అని అడిగేవారు. అప్పట్లో నాకు బాడీగార్డులు కూడా లేరు. అలాంటి మాటలను పట్టించుకోకుండా ముందుకు సాగడం అప్పుడే నేర్చుకున్నాను" అని మోదీ పేర్కొన్నారు.

కాగా, పన్ను ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలతో 2010లో లలిత్ మోదీ దేశం విడిచి పారిపోయారు. అప్పటి నుంచి ఆయన విదేశాల్లోనే ఉంటున్నారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన బీసీసీఐ, 2013లో ఆయనపై జీవితకాల నిషేధం విధించిన విషయం తెలిసిందే.
Lalit Modi
IPL
Indian Premier League
Michael Clarke
SAT exam
Duke University
fraud
tax evasion
money laundering
BCCI

More Telugu News