Nayan Santani: స్కూల్ విద్యార్థి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. బయటపడ్డ ఇన్‌స్టా చాట్!

Nayan Santani Murder Case Shocking Instagram Chat Revealed
  • అహ్మదాబాద్ స్కూల్లో పదో తరగతి విద్యార్థి దారుణ హత్య
  • కత్తితో పొడిచింది ఎనిమిదో తరగతి చదువుతున్న జూనియరే
  • హత్య తర్వాత స్నేహితుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్
  • 'అవును నేనే పొడిచా' అంటూ నేరం అంగీకరించిన నిందితుడు
  • 'ఏం చేస్తావ్' అని సవాల్ చేయడమే హత్యకు కారణమని వెల్లడి
  • బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
గుజరాత్‌లో సంచలనం సృష్టించిన పదో తరగతి విద్యార్థి హత్య కేసులో అత్యంత కీలకమైన ఆధారం లభించింది. నిందితుడైన జూనియర్ విద్యార్థి, హత్య చేసిన తర్వాత తన స్నేహితుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో జరిపిన చాటింగ్ వివరాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. "అవును, నేనే పొడిచాను. జరిగిందేదో జరిగిపోయింది, ఇక వదిలెయ్" అంటూ నిందితుడు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిన చాట్ ఇప్పుడు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

అహ్మదాబాద్‌లోని సెవెంత్-డే అడ్వెంటిస్ట్ హయ్యర్ సెకండరీ స్కూల్ వెలుపల మంగళవారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి బయలుదేరిన నయన్ సంతానీ అనే పదో తరగతి విద్యార్థిని, ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి మరికొందరితో కలిసి అడ్డగించాడు. వారి మధ్య మాటామాటా పెరిగి అది ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో, జూనియర్ విద్యార్థి తన వెంట తెచ్చుకున్న కత్తితో నయన్ కడుపులో బలంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు.

తీవ్ర గాయంతో రక్తం కారుతుండగా నయన్, తిరిగి స్కూల్‌లోకి పరుగెత్తుకుంటూ వెళ్లి కుప్పకూలిపోయాడు. పాఠశాల సిబ్బంది అతడిని హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

ఈ హత్య తర్వాత నిందితుడు తన స్నేహితుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన చాట్‌లో నేరాన్ని అంగీకరించాడు. "నువ్వేమైనా చేశావా?" అని స్నేహితుడు అడగ్గా, "అవును" అని బదులిచ్చాడు. "నువ్వే కత్తితో పొడిచావా?" అని ప్రశ్నించగా, "నీకెవరు చెప్పారు?" అని ఎదురు ప్రశ్నించాడు. 

చివరకు, "నేనే పొడిచానని చెప్పుకో" అంటూ ఒప్పుకున్నాడు. ఎందుకు పొడిచావని స్నేహితుడు అడగ్గా, "నన్ను రెచ్చగొట్టాడు, 'నువ్వేం చేస్తావ్?' అని సవాల్ విసిరాడు" అని నిందితుడు కారణం చెప్పాడు. అంతమాత్రానికే చంపేస్తావా అంటే, "జరిగిందేదో జరిగిపోయిందిలే, వదిలెయ్" అంటూ తేలికగా సమాధానమిచ్చాడు.

    ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, స్కూల్ సెక్యూరిటీ గార్డు ఇచ్చిన సమాచారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జువైనల్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటనతో అహ్మదాబాద్ నగరంలో తీవ్ర కలకలం రేగగా, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు.
Nayan Santani
Ahmedabad school murder
Gujarat student murder
Instagram chat
School fight
Student stabbed
Juvenile crime
7th Day Adventist School

More Telugu News