Jair Bolsonaro: దేశం నుంచి పారిపోయేందుకు యత్నించిన బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు.. బ్రెజిల్ రాజకీయాల్లో ప్రకంపనలు

Jair Bolsonaro Attempted to Flee Brazil Amid Coup Allegations
  • దేశం విడిచి పారిపోవాలని చూసిన బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సొనారో
  • పొరుగుదేశం అర్జెంటీనాలో రాజకీయ ఆశ్రయం కోసం ప్రయత్నం
  • ఫోన్ మెసేజ్‌ల ఆధారంగా కుట్రను బయటపెట్టిన ఫెడరల్ పోలీసులు
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాను పదవిలో కొనసాగేందుకు తిరుగుబాటుకు కుట్ర పన్నారన్న కేసులో అరెస్టు తప్పదని భావించిన ఆయన, దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించారని ఫెడరల్ పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. పొరుగు దేశమైన అర్జెంటీనాలో రాజకీయ ఆశ్రయం పొందేందుకు ఆయన భారీ స్కెచ్ వేశారని, ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలను తాము గుర్తించామని పోలీసులు వెల్లడించారు. ఈ విషయం ప్రస్తుతం బ్రెజిల్ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.

తిరుగుబాటు కుట్ర కేసుకు సంబంధించి ఫెడరల్ పోలీసులు సుప్రీంకోర్టుకు 170 పేజీల నివేదికను సమర్పించారు. ఇందులో బోల్సొనారోకు సంబంధించిన ఫోన్ మెసేజ్‌లు, వాయిస్ నోట్స్‌ను కీలక ఆధారాలుగా చేర్చారు. బ్రెజిల్‌లో తనపై రాజకీయ అణచివేత జరుగుతోందని, ప్రాణహాని ఉందని అర్జెంటీనా అధ్యక్షుడికి సందేశం పంపి, రాజకీయ ఆశ్రయం కోరినట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న తరుణంలో ఈ వివరాలు బయటకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదే కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు బోల్సొనారో గత ఫిబ్రవరిలో హంగేరియన్ రాయబార కార్యాలయంలో రెండు రోజుల పాటు తలదాచుకున్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది. తాజా పరిణామాలపై అమెరికాలో ఉంటున్న ఆయన కుమారుడు ఎడ్వర్డో బోల్సొనారో స్పందించారు. తన తండ్రితో తాను జరిపిన సంభాషణలను బయటపెట్టడం రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని ఆయన ఆరోపించారు.

ఇదిలా ఉండగా, తిరుగుబాటు కేసుతో పాటు ఇప్పుడు మరో కొత్త చిక్కు బోల్సొనారోను, ఆయన కుమారుడిని చుట్టుముట్టింది. న్యాయ విచారణ ప్రక్రియను అడ్డుకున్నారన్న ఆరోపణలపై తండ్రీకొడుకులపై మరో కేసు నమోదు చేసేందుకు ఫెడరల్ పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో వారిద్దరికీ మరిన్ని న్యాయపరమైన చిక్కులు తప్పేలా లేవు. 
Jair Bolsonaro
Brazil
Argentina
Political asylum
Coup attempt
Federal Police
Supreme Court
Eduardo Bolsonaro
Political persecution

More Telugu News