Saraswati Strips Private Limited: ఇండియాలోని ఆ కంపెనీ వంటపాత్రలపై అమెరికా హెచ్చరిక.. వాడితే ప్రాణాలకే ముప్పు!

Saraswati Strips Private Limited Cooking Pots Alert from USFDA
  • సరస్వతి స్ట్రిప్స్ కంపెనీ ఉత్పత్తులపై అమెరికా హెచ్చరిక
  • 'టైగర్ వైట్' బ్రాండ్ పేరుతో అమ్ముతున్న పాత్రల్లో లోపాలు
  • వాడకం, అమ్మకాలు వెంటనే ఆపాలని యూఎస్‌ఎఫ్డీఏ ఆదేశం
  • ఆ పాత్రల నుంచి విడుదలవుతున్న సీసం
  • దానివల్ల పిల్లల ఆరోగ్యం, ఎదుగుదలపై తీవ్ర ప్రభావం
  • మెదడు, నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని వెల్లడి 
భారత్‌కు చెందిన ఓ కంపెనీ తయారు చేస్తున్న వంట పాత్రలపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్‌ఎఫ్‌డీఏ) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ పాత్రల్లో వండిన ఆహారంలో ప్రమాదకర స్థాయిలో సీసం (లెడ్) చేరుతోందని పరీక్షల్లో తేలిందని, ఇది ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఉత్పత్తుల వాడకాన్ని, అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.

సరస్వతి స్ట్రిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే భారతీయ కంపెనీ 'టైగర్ వైట్' బ్రాండ్ పేరుతో 'స్వచ్ఛమైన అల్యూమినియం పాత్రలు' అని మార్కెటింగ్ చేస్తోంది. అయితే, యూఎస్‌ఎఫ్‌డీఏ, ఇతర రాష్ట్ర ప్రభుత్వ భాగస్వాములు జరిపిన పరీక్షల్లో ఈ అల్యూమినియం.. ఇత్తడి, హిండాలియం/ఇండాలియం వంటి మిశ్రమ లోహాలతో తయారు చేసిన పాత్రల నుంచి సీసం ఆహారంలోకి విడుదలవుతున్నట్టు నిర్ధారణ అయింది. దీనివల్ల ఆహారం విషపూరితంగా మారుతోందని యూఎస్ ఆరోగ్య నియంత్రణ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో, రిటైలర్లు ఈ ఉత్పత్తుల అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని, వినియోగదారులు వీటిని వంట కోసం గానీ, ఆహారాన్ని నిల్వ చేయడానికి గానీ ఉపయోగించవద్దని యూఎస్ ఏజెన్సీ స్పష్టంగా సూచించింది.

సీసంతో ఆరోగ్యానికి పెను ముప్పు 
సీసం మనుషులకు అత్యంత విషపూరితమైనదని, దీనికి సురక్షితమైన స్థాయి అంటూ ఏదీ లేదని ఏజెన్సీ హెచ్చరించింది. సీసం కలిసిన ఆహారం తినడం వల్ల రక్తంలో దాని స్థాయులు పెరిగిపోతాయని తెలిపింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణులపై దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని వివరించింది. పిల్లల ఆహారంలో సీసం చాలా తక్కువ పరిమాణంలో చేరినప్పటికీ, వారిలో మేధోశక్తి (ఐక్యూ) తగ్గడం, నేర్చుకోవడంలో ఇబ్బందులు, ప్రవర్తనా సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది.

సీసం స్థాయులు శరీరంలో పెరిగితే అలసట, తలనొప్పి, కడుపునొప్పి, వాంతులు, నాడీ సంబంధిత మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇది మెదడు, నాడీ వ్యవస్థ పనితీరును దెబ్బతీసి జ్ఞాపకశక్తి తగ్గడానికి, ఏకాగ్రత లోపించడానికి కారణమవుతుంది. అంతేకాకుండా, రక్తహీనత, కిడ్నీల వైఫల్యం, అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని యూఎస్‌ఎఫ్‌డీఏ తన ప్రకటనలో తెలిపింది.
Saraswati Strips Private Limited
Tiger White brand
USFDA warning
lead contamination
cooking pots
food safety
health risks
Indian company
aluminum cookware

More Telugu News