Krishna River: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కృష్ణా, గోదావరి ..సముద్రంలోకి 15 లక్షల క్యూసెక్కుల నీరు

Krishna Godavari Rivers Overflowing 15 Lakh Cusecs into Sea
  • ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5,05,976 క్యూసెక్కులు
  • ధవళేశ్వరం ప్రాజెక్టు నుంచి 9,84,339 క్యూసెక్కుల వరద సముద్రంలోకి
  • ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దాదాపు 15 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తోంది. కృష్ణానది నుంచి దాదాపు 5 లక్షల క్యూసెక్కులు, గోదావరి నుంచి సుమారు 10 లక్షల క్యూసెక్కులు సముద్రం పాలవుతోంది.

కృష్ణానది వరద ప్రభావంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి నీరు భారీగా చేరుతోంది. ప్రస్తుతం (గురువారం ఉదయానికి) ఇన్‌ఫ్లో 5,05,976 క్యూసెక్కులు ఉండగా అంతే మొత్తంలో వరద నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

మరోవైపు గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. నిన్న రాత్రి 10 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 48 అడుగులు కాగా.. గురువారం ఉదయానికి 50.8 అడుగుల మేర ప్రవహిస్తోంది. ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరి పలు మండలాల్లోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద కల్యాణ కట్ట ప్రాంతం వరకు వరద నీరు చేరింది. స్నానఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు, విద్యుత్ స్తంభాలు నీటిలో మునిగిపోయాయి.

ఇక ధవళేశ్వరం వద్ద 9,84,339 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవగా.. అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఆనకట్ట వద్ద 11.9 అడుగుల నీటి మట్టం నమోదైంది. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. నదీ పరీవాహాక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. 
Krishna River
Godavari River
Andhra Pradesh Floods
Vijayawada Prakasam Barrage
Bhadrachalam Godavari
Dhavaleswaram Barrage
River Flooding
Heavy Rainfall
Prachar Jain
AP Disaster Management

More Telugu News