KPHB: కేపీహెచ్‌బీలో భూమికి రికార్డు ధర.. ఎకరం ఏకంగా రూ. 70 కోట్లు!

Godrej Properties Acquires KPHB Land for Rs 70 Crore Per Acre
  • కేపీహెచ్‌బీలో ఎకరం రూ. 70 కోట్లకు కొనుగోలు చేసిన గోద్రెజ్ ప్రాపర్టీస్
  • ఈ-వేలం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి రూ. 547 కోట్ల భారీ ఆదాయం
  • మూడు గంటల పాటు సాగిన హోరాహోరీ వేలం పాట
  • పేదల ఇళ్ల నిర్మాణం కోసం ఈ నిధుల వినియోగం
  • రాజీవ్ స్వగృహ టవర్ల అమ్మకంతో మరో రూ. 70 కోట్లు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మరోసారి భూమి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ (కేపీహెచ్‌బీ) ప్రాంతంలో ఎకరం భూమి ఏకంగా రూ. 70 కోట్లు పలికింది. తెలంగాణ హౌసింగ్ బోర్డ్ బుధవారం నిర్వహించిన ఈ-వేలంలో ఈ అరుదైన రికార్డు నమోదైంది. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి ఒక్కరోజే రూ. 547 కోట్ల భారీ ఆదాయం సమకూరింది.

వివరాల్లోకి వెళితే.. కేపీహెచ్‌బీలో ఉన్న 7.8 ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు హౌసింగ్ బోర్డ్ గత నెలలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఎకరాకు కనీస ధరగా రూ. 40 కోట్లు నిర్ణయించగా, ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి తీవ్రమైన పోటీ ఎదురైంది. సుమారు మూడు గంటల పాటు హోరాహోరీగా సాగిన ఈ-వేలంలో బిడ్ ధర 46 సార్లు పెరిగింది. చివరికి, ప్రముఖ నిర్మాణ సంస్థ గోద్రెజ్ ప్రాపర్టీస్ ఎకరాకు రూ. 70 కోట్ల చొప్పున ఈ భూమిని దక్కించుకుంది. ఈ వేలంలో గోద్రెజ్‌తో పాటు అరోబిందో రియాల్టీ, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, అశోకా బిల్డర్స్ వంటి దిగ్గజ సంస్థలు కూడా పాల్గొన్నాయని హౌసింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వి.పి. గౌతమ్ వెల్లడించారు.

ఈ భూమి అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజల గృహ నిర్మాణ అవసరాల కోసం వినియోగించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి ఈ నిధులను కేటాయించనున్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా, మరోవైపు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కూడా తన ఆస్తులను విక్రయించింది. పోచారం, గాజులరామారం టౌన్‌షిప్‌లలో అసంపూర్తిగా ఉన్న మూడు టవర్లను విక్రయించడం ద్వారా కార్పొరేషన్‌కు రూ. 70.11 కోట్ల ఆదాయం చేకూరింది.
KPHB
Godrej Properties
Hyderabad real estate
Godrej
Telangana housing board
land auction
Indiramma houses scheme
real estate market
Aurobindo Realty
Prestige Estates

More Telugu News