Mallu Bhatti Vikramarka: జీవిత, ఆరోగ్య బీమాపై త్వరలో కేంద్రం శుభవార్త! ప్రభుత్వానికి తగ్గే ఆదాయంపై మల్లు భట్టి విక్రమార్క అంచనా

Mallu Bhatti Vikramarka Expects Good News on Life Health Insurance Soon
  • జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ రద్దుకు సిఫార్సు
  • ప్రస్తుత 18 శాతం పన్నును సున్నా శాతానికి తెచ్చే ప్రతిపాదన
  • ఢిల్లీలో సమావేశమైన రాష్ట్ర మంత్రుల బృందం కీలక నిర్ణయం
  • దీనివల్ల రూ.9,700 కోట్ల ఆదాయ నష్టం వాటిల్లుతుందని అంచనా
  • త్వరలో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం
దేశవ్యాప్తంగా కోట్లాది మంది బీమా పాలసీదారులకు భారీ ఊరట లభించే అవకాశం ఉంది. జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై ప్రస్తుతం విధిస్తున్న 18 శాతం జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని రాష్ట్ర మంత్రుల బృందం (జీవోఎం) కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదన అమలైతే పాలసీల ప్రీమియంలు గణనీయంగా తగ్గనున్నాయి.

పరోక్ష పన్నుల విధానంలో తీసుకురానున్న సంస్కరణలపై చర్చించేందుకు బుధవారం న్యూఢిల్లీలో మంత్రుల బృందం సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం బీహార్ ఉప ముఖ్యమంత్రి, మంత్రుల బృందం కన్వీనర్ సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ, జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీని 18 శాతం నుంచి సున్నా శాతానికి తగ్గించాలని తాము ప్రతిపాదించినట్లు వెల్లడించారు.

రూ. 9,700 కోట్లు తగ్గుతుందన్న మల్లు భట్టి విక్రమార్క

ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.9,700 కోట్ల ఆదాయం తగ్గుతుందని తెలంగాణ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అంచనా వేశారు. బీమా ప్రీమియంలపై జీఎస్టీ తొలగింపు ప్రయోజనాన్ని ఆయా బీమా సంస్థలు వినియోగదారులకు బదిలీ చేసేలా యంత్రాంగం ఉండాలని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. జీఎస్టీని తొలగించడం లేదా తగ్గించడంపై రాష్ట్రాలు సుముఖంగా ఉన్నాయని, ప్రయోజనం బదిలీ చేసే అంశాన్ని చాలా రాష్ట్రాలు లేవనెత్తాయని చెప్పారు. జీఎస్టీ కౌన్సిల్‌లో దీనిపై నిర్ణయం ఉంటుందని చెప్పారు.

అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు జీఎస్టీలో భారీ మార్పులు తీసుకురానున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ సంస్కరణలను ప్రతిపాదిస్తున్నారు. మంత్రుల బృందం చేసిన ఈ సిఫార్సులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశం సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో దీపావళికి ముందే జరిగే అవకాశం ఉంది.
Mallu Bhatti Vikramarka
GST council
GST on insurance
health insurance
life insurance
Nirmala Sitharaman

More Telugu News