Shashi Tharoor: కాంగ్రెస్‌కు శశిథరూర్ షాక్.. మోదీ ప్రభుత్వ కీలక బిల్లుకు సమర్థన

Shashi Tharoor Backs Modi Government on Key Bill Shocks Congress
  • వివాదాస్పద అనర్హత బిల్లుపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • పార్టీ, ఇండియా కూటమి వైఖరికి భిన్నంగా శశిథరూర్ అభిప్రాయం
  • 30 రోజులు జైలులో ఉంటే మంత్రిగా ఎలా కొనసాగుతారని సూటి ప్రశ్న
  • బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని సూచన
  • ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చే కుట్రగా బిల్లుపై విపక్షాల తీవ్ర నిరసన
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, సీనియర్ ఎంపీ శశిథరూర్ మరోసారి పార్టీ వైఖరికి భిన్నంగా తన గళాన్ని వినిపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న 'అనర్హత' బిల్లుల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర, రాష్ట్రాల్లోని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు ఎవరైనా వరుసగా 30 రోజుల పాటు కస్టడీలో ఉంటే వారి పదవిని రద్దు చేసే నిబంధన ఈ బిల్లుల సారాంశం.

ఈ బిల్లులపై 'ఇండియా' కూటమిలోని పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తుండగా, శశి థరూర్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. బుధవారం లోక్‌సభ వాయిదా పడిన తర్వాత ఆయన మాట్లాడుతూ, "30 రోజుల పాటు జైలులో ఉన్న వ్యక్తి మంత్రిగా ఎలా కొనసాగుతారు? ఇది చాలా సాధారణమైన విషయం. ఇందులో నాకు పెద్దగా తప్పేమీ కనిపించడం లేదు" అని వ్యాఖ్యానించారు. ఎవరైనా తప్పు చేస్తే మంత్రి పదవిలో ఉండకూడదన్నది చాలా తార్కికమైన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే, తాను ఇంకా బిల్లును పూర్తిగా చదవలేదని, తన ఈ అభిప్రాయమే చివరిది కాదని శశిథరూర్ స్పష్టం చేశారు. ఈ బిల్లుపై ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు, దానిపై లోతైన చర్చ జరిపేందుకు దీనిని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి (జేపీసీకి) పంపాలని ఆయన సూచించారు.

ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపిస్తామని అధికార వర్గాలు వెల్లడించడంపై కూడా శశిథరూర్ స్పందించారు. ఇది ఎంతో మంచి విషయమని ఆయన అన్నారు. ఇది మన ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.
Shashi Tharoor
Disqualification Bill
Congress
Priyanka Gandhi
India Alliance
Parliament

More Telugu News