Pawan Kalyan: పిఠాపురం మహిళలకు పవన్ కల్యాణ్ శ్రావణ శుక్రవారం కానుక

Sravana Masam Gift Pawan Kalyan to Distribute Sarees to Women
  • 10 వేల మందికి చీరలు, పసుపు, కుంకుమల పంపిణీకి ఏర్పాట్లు
  • పాదగయ క్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాల నిర్వహణ
  • ఆగస్టు 22న ఐదు విడతలుగా కార్యక్రమం
  • కూపన్ల ఆధారంగా సమయాల కేటాయింపు
  • ఏర్పాట్లలో పోలీసులు, జనసేన వాలంటీర్లు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ తన నియోజకవర్గ మహిళలకు శ్రావణమాస కానుకను ప్రకటించారు. శ్రావణమాసంలో చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని, 10 వేల మంది మహిళలకు చీరలతో పాటు పసుపు, కుంకుమలను అందించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నెల 22వ తేదీన పిఠాపురంలోని ప్రసిద్ధ శ్రీ పాదగయ క్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అక్కడి ఉమా కుక్కుటేశ్వరస్వామి, పురుహూతిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరపనున్నారు. ఈ వ్రతాల్లో పాల్గొనే మహిళలకు ఈ కానుకలను అందజేయనున్నారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు, రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఐదు విడతలుగా వరలక్ష్మీ వ్రతాలను నిర్వహిస్తారు. ప్రతి విడతకూ అంబిక, భ్రమరాంబ, చాముండి, దుర్గ, ఈశ్వరి అని అమ్మవార్ల పేర్లతో నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే మహిళల కోసం గురువారం నుంచే కూపన్ల పంపిణీ ప్రారంభం కానుంది. ప్రతి కూపన్‌పై నిర్దిష్ట సమయాన్ని ముద్రిస్తారు. మహిళలు తమకు కేటాయించిన సమయానికి ఆలయానికి చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు.

మధ్యాహ్నం 1 గంట తర్వాత వచ్చే మహిళలకు కూడా కానుకలు అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ బృహత్కార్యక్రమాన్ని దేవాలయ సిబ్బంది, పోలీసులు, జనసేన వాలంటీర్లు సమన్వయంతో పర్యవేక్షించనున్నారు.
Pawan Kalyan
Pithapuram
Sravana Masam
Varalakshmi Vratham
Andhra Pradesh
Women Empowerment
Janasena
Uma Kukkuteswara Swamy
gifts
hindu festival

More Telugu News