Rekha Gupta: ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి కేసులో కీలక ఆధారం

Rekha Gupta Attacked CCTV Footage Reveals Key Evidence
  • దాడికి ముందు రెక్కీ నిర్వహించిన నిందితుడు.. బయటపడ్డ సీసీటీవీ ఫుటేజ్
  • ముఖ్యమంత్రి నివాసం వద్ద వీడియో తీసిన నిందితుడు రాజేష్
  • ఇది పక్కా ప్రణాళికతో జరిగిన దాడేనంటున్న మంత్రులు
  • నిందితుడికి నేర చరిత్ర.. గుజరాత్‌లో పలు కేసులు నమోదు
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై జరిగిన దాడి కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది యాదృచ్ఛికంగా జరిగిన దాడి కాదని, పక్కా ప్రణాళికతోనే జరిగిందన్న వాదనలకు బలం చేకూర్చే కీలక ఆధారం పోలీసులకు లభించింది. దాడికి పాల్పడిన నిందితుడు రాజేష్ భాయ్ ఖిమ్జీ భాయ్ సకారియా, ఘటనకు ఒక రోజు ముందు ముఖ్యమంత్రి నివాసం వద్ద రెక్కీ నిర్వహించినట్లు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా రికార్డయింది.

బుధవారం సివిల్ లైన్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా 'జన సున్వాయి' కార్యక్రమం నిర్వహిస్తుండగా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన 41 ఏళ్ల రాజేష్ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులకు ఆగస్టు 19వ తేదీ నాటి సీసీటీవీ ఫుటేజ్ లభించింది. ఈ వీడియోలో నిందితుడు రాజేష్.. షాలిమార్ బాగ్‌లోని ముఖ్యమంత్రి వ్యక్తిగత నివాసం పరిసరాలను పరిశీలించడమే కాకుండా, తన ఫోన్‌లో వీడియో కూడా రికార్డ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ దాడి వెనుక కుట్ర కోణం ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

మరోవైపు, నిందితుడు రాజేష్‌కు నేర చరిత్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అతనిపై రాజ్‌కోట్‌లోని భక్తినగర్ పోలీస్ స్టేషన్‌లో మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. వాటిలో నాలుగు కేసుల నుంచి నిర్దోషిగా బయటపడగా, మరో కేసు కోర్టులో విచారణ దశలో ఉంది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ సెప్టెంబర్ 9న జరగనుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో, దాడి కచ్చితంగా ముందస్తు ప్రణాళికతో జరిగిందేనని ఢిల్లీ మంత్రులు పర్వేష్ వర్మ, మంజిందర్ సింగ్ సిర్సా ఆరోపిస్తున్నారు. నిందితుడు ముఖ్యమంత్రి జుట్టు పట్టుకుని కింద పడేశాడని, వెంటనే భద్రతా సిబ్బంది, స్థానికులు అప్రమత్తమై ఆమెను రక్షించారని వారు తెలిపారు. ఇంతటి భద్రత నడుమ ఈ దాడి జరగడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ భద్రతా వైఫల్యంపై అంతర్గత విచారణ జరుపుతామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. నిందితుడిని లోతుగా విచారిస్తున్న పోలీసులు, దాడికి గల అసలు కారణాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో మరింత సమాచారం కోసం గుజరాత్ పోలీసులను కూడా సంప్రదించారు.

దాడికి గల కారణాలపై భిన్న వాదనలు

ముఖ్యమంత్రిపై సకారియా ఎందుకు దాడి చేశాడనే విషయంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. నిందితుడి బంధువు జైల్లో ఉన్నాడని, అతడిని విడుదల చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసేందుకు సీఎం అధికారిక నివాసానికి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే వీటిని పోలీసులు ధృవీకరించాల్సి ఉంది.

గుజరాత్‌లో నిందితుడి తల్లిని ప్రశ్నించిన అధికారులు, వివరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. తన కొడుకు ఢిల్లీ ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్లిన విషయం తనకు తెలియదని ఆమె చెప్పినట్లుగా సమాచారం. అయితే అతడు జంతు ప్రేమికుడని, ఇటీవల వీధి శునకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అసంతృప్తిగా ఉన్నాడని తెలుస్తోంది. అతని మానసిక పరిస్థితి బాగాలేదని కూడా తెలుస్తోంది. 
Rekha Gupta
Delhi CM attack
Rajesh Sakaria
Delhi news
Delhi police
Gujarat
CCTV footage

More Telugu News