Mokshagna: మోక్షజ్ఞ సినిమా, బాలయ్యతో తన సినిమాపై నారా రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Nara Rohith Reveals Details About Mokshagnas Movie Debut
  • ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ కోసం మోక్షజ్ఞ ఎదురు చూస్తున్నాడన్న రోహిత్
  • సినిమాల్లోకి రావడం కోసమే మోక్షజ్ఞ తన లుక్ మార్చుకున్నాడని వెల్లడి
  • బాబాయ్ తో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానన్న రోహిత్
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం ఎప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఆయన కొత్త లుక్ వైరల్ కావడంతో ఈ చర్చ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో, మోక్షజ్ఞ ఎంట్రీపై నటుడు నారా రోహిత్ స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం మోక్షజ్ఞ మంచి స్క్రిప్ట్ కోసం వెతుకుతున్నాడని, ఇండస్ట్రీలోకి వచ్చేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాడని తెలిపారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నారా రోహిత్ మాట్లాడుతూ, "మోక్షజ్ఞతో ఇటీవల మాట్లాడాను. ఓ మంచి ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ కోసం చూస్తున్నట్లు చెప్పాడు. అలాంటి కథ దొరికితే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలోనే అతని ఎంట్రీ ఉంటుంది. సినిమాల్లోకి రావడం కోసమే తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. పాత లుక్‌కు, ఇప్పటికీ చాలా తేడా ఉంది" అని వివరించారు. ఈ వార్తతో నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

ఇదే సందర్భంగా, బాలకృష్ణతో తాను చేయాల్సిన మల్టీస్టారర్ సినిమా గురించి కూడా నారా రోహిత్ మాట్లాడారు. "గతంలో మా ఇద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా కోసం కథ సిద్ధమైంది. లుక్ టెస్ట్ కూడా పూర్తయింది. కానీ, అప్పట్లో బాలయ్య బాబాయ్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం, ఎన్నికలు కూడా రావడంతో ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు" అని చెప్పారు. భవిష్యత్తులో బాలయ్యతో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని, ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నానని రోహిత్ తెలిపారు.

ఇక తన సినిమాల విషయానికొస్తే, తాను హీరోగా నటించిన ‘సుందరకాండ’ ఈ నెల 27న విడుదల కానుందని రోహిత్ ప్రకటించారు. వెంకటేశ్‌ నిమ్మలపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాలపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, సమయం దొరికినప్పుడల్లా కార్యకర్తలతో టచ్‌లో ఉంటున్నానని, ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు.

Mokshagna
Nandamuri Balakrishna
Nara Rohith
Mokshagna entry
Tollywood debut
Sundarakanda movie
Telugu cinema
Nandamuri fans
Feel good love story
Balakrishna multistarrer

More Telugu News