R Ashwin: గిల్ వచ్చాడు.. సంజూ శాంసన్ బెంచ్‌కు పరిమితం కావడం ఖాయం: అశ్విన్

R Ashwin Says Sanju Samson Not Going To Play Shubman Gill Is The Reason
  • ఆసియా కప్ 2025 జట్టు ఎంపికపై అశ్విన్ విశ్లేషణ
  • జైస్వాల్, శ్రేయస్ అయ్యర్‌ను పక్కన పెట్టడంపై అసంతృప్తి
  • శుభ్‌మన్ గిల్‌కు వైస్ కెప్టెన్సీ ఇవ్వడంపై కీలక వ్యాఖ్యలు
  • గిల్ జట్టులోకి రావడంతో సంజూ శాంసన్‌కు చోటు కష్టమేనని జోస్యం
  • గిల్ ఎంపిక సరైందే కానీ, ఇతరులకు అన్యాయం జరిగిందని వ్యాఖ్య
ఆసియా కప్ 2025 కోసం భారత టీ20 జట్టును ప్రకటించిన వేళ, టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సెలక్షన్ కమిటీ నిర్ణయాలపై కీలక వ్యాఖ్యలు చేడు. ముఖ్యంగా శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించడం వల్ల, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కడం దాదాపు అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డాడు. గిల్ రాకతో జట్టు కూర్పులో మార్పులు తప్పవని, దీనివల్ల సంజూ బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుందని తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా విశ్లేషించాడు.

"శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ప్రకటించడంతో ఇప్పుడు సంజూ శాంసన్ స్థానానికి ముప్పు ఏర్పడింది. సంజూ తుది జట్టులో ఆడటం జరగదు. శుభ్‌మన్ గిల్ కచ్చితంగా ఓపెనింగ్ చేస్తాడు" అని అశ్విన్ వివ‌రించాడు. గిల్‌కు వైస్ కెప్టెన్సీ ఇవ్వడంతో అతను తుది జట్టులో ఆడటం ఖాయమని, దీంతో అభిషేక్ శర్మతో కలిసి గిల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని అశ్విన్ అంచనా వేశాడు.

అదే సమయంలో, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్‌లను జట్టు నుంచి తప్పించడం పట్ల అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో మూడో ఓపెనర్‌గా ఉన్న జైస్వాల్‌ను ఇప్పుడు పక్కనపెట్టి, గిల్‌ను తీసుకోవడం ఆశ్చర్యం కలిగించిందన్నాడు. "జట్టు ఎంపిక అనేది చాలా కష్టమైన పని అని నాకు తెలుసు. కానీ జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ విషయంలో నాకు చాలా బాధగా ఉంది. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లకు ఇది న్యాయం కాదు" అని అన్నాడు. వారిని ఎందుకు ఎంపిక చేయలేదో సెలక్టర్లు వారికి ఫోన్ చేసి వివరించి ఉంటారని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

గిల్ ఎంపికను తాను సమర్థిస్తున్నానని, ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున అతను అద్భుతంగా రాణించాడని అశ్విన్ పేర్కొన్నాడు. "గిల్ ఎంపికను నేను అర్థం చేసుకోగలను. బహుశా భవిష్యత్తులో అతడిని అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా చూస్తున్నారేమో. కానీ అన్ని ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉండాల్సిన అవసరం లేదు" అని అశ్విన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. మొత్తం మీద, ఆసియా కప్ జట్టు ఎంపిక పలువురు ఆటగాళ్ల భవిష్యత్తుపై చర్చకు దారితీసింది.
R Ashwin
Sanju Samson
Shubman Gill
Asia Cup 2025
Indian Cricket Team
T20 World Cup
Yashasvi Jaiswal
Shreyas Iyer
Cricket Selection
Gujarat Titans

More Telugu News