Delhi: ఢిల్లీలో 'దృశ్యం' సినిమా సీన్.. భార్యను చంపి పాతిపెట్టిన భర్త

Drishyam Style Murder In Delhi Painter Buried Wifes Body In Graveyard
  • భార్యపై అనుమానంతో ఢిల్లీలో దారుణ హత్య
  • దృశ్యం సినిమాను తలపించేలా పక్కా ప్లాన్‌తో నేరం
  • హత్య చేసి మృతదేహాన్ని శ్మశానంలో పాతిపెట్టిన భర్త
  • తాను వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతున్నట్టు భార్య ఫోన్ నుంచే తనకు తాను మెసేజ్
  • సీసీటీవీ ఫుటేజీతో హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు
'దృశ్యం' సినిమాను తలపించేలా ఢిల్లీలో ఒక దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. తన భార్యకు అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో ఒక వ్యక్తి ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసి, శవాన్ని శ్మశానంలో పాతిపెట్టాడు. ఆ తర్వాత ఆమె ప్రియుడితో పారిపోయినట్లు నమ్మించేందుకు పెద్ద నాటకమే ఆడాడు. అయితే, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఈ హత్య కేసు మిస్టరీని ఛేదించి, నిందితుడితో పాటు అతనికి స‌హ‌క‌రించిన‌ ఇద్దరు స్నేహితులను అరెస్ట్ చేశారు.

సౌత్ డీసీపీ అంకిత్ చౌహాన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాకు చెందిన షాదాబ్ అలీ (47) అనే పెయింటర్, తన భార్య ఫాతిమా (30) ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం, సుమారు ఐదు రోజుల పాటు భార్యకు బలవంతంగా మత్తు మందులు, పురుగుల మందు తాగించి చంపేశాడు. అనంతరం షారుఖ్ ఖాన్, తన్వీర్ అనే ఇద్దరు స్నేహితుల సహాయంతో ఆగస్టు 2న‌ రాత్రి ఆమె మృతదేహాన్ని కారులో మెహ్రౌలీలోని ఒక శ్మశానవాటికకు తీసుకెళ్లి పాతిపెట్టాడు. ఆమె బట్టలను ఒక కాలువలో పడేశాడు.

ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, షాదాబ్ తన సొంత ఊరైన అమ్రోహాకు వెళ్లిపోయాడు. అక్కడి నుంచి ఫాతిమా ఫోన్ నుంచే తన ఫోన్‌కు 'నేను వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతున్నాను' అని ఒక టెక్స్ట్ మెసేజ్ పంపుకున్నాడు. అయితే, ఆగస్టు 10న ఫాతిమా స్నేహితురాలు ఒకరు మెహ్రౌలీ పోలీస్ స్టేషన్‌లో ఆమె కనపడటం లేదని, ఆమెను కిడ్నాప్ చేసి ఉంటారని ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

విచారణలో భాగంగా పోలీసులు పరిశీలించిన ఒక సీసీటీవీ ఫుటేజీలో, ఫాతిమా తన భర్త, అతని స్నేహితులతో కలిసి అపస్మారక స్థితిలో కనిపించింది. దీంతో పోలీసులు షాదాబ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట నేరాన్ని అంగీకరించని షాదాబ్, శవాన్ని కాలువలో పడేశానని చెప్పి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. అయితే, పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని, అందుకే ఆమెను హత్య చేసినట్లు అంగీకరించాడు.

షాదాబ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆగస్టు 15న సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) సమక్షంలో ఫాతిమా మృతదేహాన్ని వెలికితీశారు. ఈ కేసులో షాదాబ్, షారుఖ్, తన్వీర్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.
Delhi
Shadab Ali
Delhi crime
murder case
illicit affair
crime news
Drishyam movie
Fatima murder
Mehrauli
Shahrukh Khan
Tanveer

More Telugu News