APSRTC Free Bus Ride: 'కట్లపొడి కోసం ఫ్రీ బస్సు ప్రయాణం'.. యువతి రీల్‌తో ఏపీలో కొత్త చర్చ

AP Free Bus Ride Reel Sparks Debate on Misuse
  • ఏపీలో ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మొదలైన చర్చ
  • ప్రభుత్వ పథకం దుర్వినియోగం అవుతోందంటూ సోషల్ మీడియాలో విమర్శలు
  •  పథకం అసలు ఉద్దేశం దెబ్బతింటోందని నెటిజన్ల అభిప్రాయం
  • యువతి వీడియోపై సర్వత్ర ఆగ్రహం
ప్రభుత్వాలు ఉదాత్త ఆశయంతో ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల అమలు తీరుపై తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం విషయంలోనూ ఇలాంటి చర్చే మొదలైంది. అనంతపురం జిల్లాకు చెందిన ఓ మహిళ సరదాగా చేసిన సోషల్ మీడియా రీల్, ఈ పథకం దుర్వినియోగం అవుతోందా అనే కొత్త వాదనకు దారితీసింది.

అనంతపురం జిల్లాకు చెందిన ఓ మహిళ ఇటీవల ఆర్టీసీ బస్సు ముందు నిలబడి ఒక వీడియో రూపొందించింది. "మా అమ్మకు కట్లపొడి, ఆకులు అంటే చాలా ఇష్టం. అవి తీసుకురావడానికి తాడిపత్రి నుంచి అనంతపురం వరకు ఉచితంగా బస్సులో వెళ్తున్నా" అంటూ ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది.

ఈ వీడియోపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. మహిళల ఆర్థిక స్వావలంబన, ఉద్యోగ, అత్యవసర ప్రయాణ అవసరాల కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని, కానీ ఇలాంటి చిన్న చిన్న వ్యక్తిగత పనులకు కూడా ప్రభుత్వ పథకాన్ని వాడుకోవడం సరికాదని పలువురు విమర్శిస్తున్నారు. ప్రజాధనంతో నడిచే ఈ పథకాన్ని బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని హితవు పలుకుతున్నారు. ఈ తరహా ప్రయాణాల వల్ల నిజంగా అవసరం ఉన్నవారికి బస్సుల్లో రద్దీ పెరిగి ఇబ్బందులు ఎదురవుతాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

అయితే, ఇంకొందరు మాత్రం ఇందులో తప్పేముందని, ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఆమె వినియోగించుకుందని సమర్థిస్తున్నారు. ఏది ఏమైనా, ఓ మహిళ సరదాగా చేసిన ఈ చిన్న వీడియో, రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ పథకం ఉద్దేశం, దాని వినియోగంపై పెద్ద చర్చకు దారితీసింది.
APSRTC Free Bus Ride
Andhra Pradesh free bus
free bus travel AP
Anantapur RTC bus
AP women free bus ride
social media reel
Katlapodi
Tadipatri Anantapur
APSRTC bus travel

More Telugu News