Mumbai Monorail: ముంబై మోనోరైలులో 4 గంటలపాటు చిక్కుకుపోయిన ప్రయాణికులు.. ఎలా రక్షించారో చూడండి!

Mumbai Monorail Passengers Stranded for 4 Hours Rescued
  • ముంబైలో మార్గమధ్యంలో నిలిచిపోయిన మోనోరైలు
  • భారీ వర్షాల వేళ సాంకేతిక లోపంతో ఘటన
  • దాదాపు 4 గంటల పాటు రైలులో చిక్కుకున్న 582 మంది
  • ఊపిరాడక 12 మంది ప్రయాణికులకు అస్వస్థత
  • అందరినీ సురక్షితంగా కిందకు దించిన సహాయక బృందాలు
  • ఘటనపై విచారణకు ఆదేశించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో మోనోరైలు ప్రయాణికులు పెను ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. భారీ వర్షాల కారణంగా తలెత్తిన సాంకేతిక లోపంతో ఓ మోనోరైలు మార్గమధ్యంలోనే ఎత్తైన ట్రాక్‌పై నిలిచిపోయింది. దీంతో సుమారు 582 మంది ప్రయాణికులు దాదాపు నాలుగు గంటల పాటు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

నిన్న సాయంత్రం 6:15 గంటల సమయంలో ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న ఓ మోనోరైలు భక్తిపార్క్, చెంబూర్ స్టేషన్ల మధ్య ఉన్నట్టుండి ఆగిపోయింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడంతో రైలు కదలలేదు. సమాచారం అందుకున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ), అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్కై ల్యాడర్ల సహాయంతో నాలుగు గంటల పాటు శ్రమించి, రైలులో చిక్కుకున్న ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు.

ఈ ఘటనలో ఊపిరాడక ఇబ్బంది పడిన 12 మంది ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. "రైలు అరగంట ఆలస్యంగా రావడంతో ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. సాయంత్రం 5:30 గంటల నుంచి నేను రైలులోనే ఉన్నాను. గంట తర్వాత సహాయక చర్యలు మొదలయ్యాయి" అని ప్రమాదం నుంచి బయటపడిన ఓ ప్రయాణికుడు తెలిపారు.

ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ప్రయాణికుల భద్రతకే తమ ప్రథమ ప్రాధాన్యమని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఎక్స్ ద్వారా ఆయన భరోసా ఇచ్చారు. ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. మరోవైపు, భారీ వర్షాల వల్ల హార్బర్ లైన్ మూసివేయడంతో ప్రయాణికులంతా మోనోరైలును ఆశ్రయించారని, రద్దీ కారణంగా విద్యుత్ వ్యవస్థపై భారం పడి ఈ లోపం తలెత్తిందని ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Mumbai Monorail
Mumbai
Monorail
Devendra Fadnavis
Eknath Shinde
BMC
train
accident
Maharashtra
Chembur

More Telugu News