Airtel: జియో బాటలోనే ఎయిర్ టెల్... 1జీబీ ప్లాన్ నిలిపివేత

Airtel Stops 1GB Plan Following Jio Path
  • రూ.249 ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను నిలిపివేసిన ఎయిర్‌‌టెల్
  • యూజర్ల నుంచి వచ్చే సగటు ఆదాయం పెంపు లక్ష్యంగా చర్యలు
  • ఇదే దారిలో వోడాఫోన్ ఐడియాకూ మార్పు సూచనలు
ప్రధాన టెలికాం సంస్థల్లో ఒకటైన ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న రూ.249 ఎంట్రీ లెవెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం నేటి నుంచి (ఆగస్టు 20) అమల్లోకి వచ్చింది.

ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు 24 రోజులకు రోజుకు 1జీబీ డేటా, అపరిమిత కాల్స్ లభించేవి. ప్లాన్ తొలగింపుతో ఇకపై వినియోగదారులు కనీసం రూ.319 ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌కు 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.

జియో బాటలో ఎయిర్‌టెల్

ఇప్పటికే టెలికాం దిగ్గజం జియో.. 28 రోజుల ప్లాన్‌గా ఉన్న 1జీబీ డే డేటా ప్లాన్‌ను తొలగించింది. ప్రస్తుతం జియో వెబ్‌సైట్‌లో రూ.299 (1.5జీబీ/డే), రూ.349 (2జీబీ/డే) ప్లాన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. జియో నిర్ణయం వెలువడిన కొన్ని గంటల్లోనే ఎయిర్‌టెల్ నుంచి ఈ కీలక ప్రకటన వెలువడటం గమనార్హం.

వొడాఫోన్ ఐడియా కూ మార్పు సూచనలు

ఇక మరో టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (Vi) కూడా ఇదే మార్గంలో నడిచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం Vi రూ.299కు 1జీబీ/డే ప్లాన్‌ను అందిస్తోంది. త్వరలో ఈ ప్లాన్ కూడా తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ARPU పెంపే లక్ష్యం

ఈ మార్పుల వెనుక ప్రధాన ఉద్దేశం యూజర్ల నుంచి వచ్చే సగటు ఆదాయం (Average Revenue Per User) పెంచుకోవడమేనని పరిశీలకులు చెబుతున్నారు. జియో వినియోగదారుల్లో సుమారు 20–25 శాతం మంది, ఎయిర్‌టెల్ వినియోగదారుల్లో 18–20 శాతం మంది 1జీబీ ఎంట్రీ లెవెల్ ప్లాన్‌ను వాడుతున్నట్లు అంచనా. ఈ ప్లాన్ల తొలగింపు వల్ల టెలికాం సంస్థలకు 4–7 శాతం వరకు ఆదాయ పెరుగుదల, ప్రతి వినియోగదారు నుంచి సగటుగా రూ.10–13 వరకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థలు పేర్కొంటున్నాయి. 
Airtel
Airtel prepaid plan
Jio
Vodafone Idea
Vi
telecom industry
1GB data plan
ARPU
telecom companies
prepaid plans

More Telugu News