Opal Suchata Hwong: ఏపీలో సందడి చేసిన 'మిస్ వరల్డ్'

Opal Suchata Hwong Miss World Visits Andhra Pradesh Village
  • కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామాన్ని సందర్శించిన మిస్ వరల్డ్, మిస్ ఆసియా
  • గ్రామంలో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్‌ను ప్రారంభించిన సుందరీమణులు
  • సుధారెడ్డి ఫౌండేషన్ – మెయిల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రామంలో కార్యక్రమాలు
ప్రపంచ సుందరీమణులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలం, డోకిపర్రు గ్రామంలో సందడి చేశారు. మిస్ వరల్డ్ ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ, మిస్ ఆసియా కృష్ణా గ్రావిడెజ్ నిన్న ఈ గ్రామాన్ని సందర్శించి గ్రామ ప్రజలకు మరచిపోలేని అనుభూతిని కలిగించారు. సంప్రదాయ తెలుగు వస్త్రధారణలో వీరిద్దరూ గ్రామంలో అడుగుపెట్టగా, గ్రామస్తులు హారతులతో, కుంకుమ బొట్లు పెట్టి ఘనంగా స్వాగతం పలికారు.

**గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అందాల రాణులు**

ఈ సందర్భంగా డోకిపర్రులోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించిన మిస్ వరల్డ్, మిస్ ఆసియా.. ఆలయ పరిసరాల్లో జరిగిన కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. భారతీయ సాంప్రదాయ కళలకు వారు మురిసిపోయారు.

**బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్‌ను ప్రారంభించిన సుందరీమణులు**

ఆ తర్వాత సుధారెడ్డి ఫౌండేషన్ – మెయిల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్‌ను మిస్ వరల్డ్ ఓపల్ సుచాత, మిస్ ఆసియా కృష్ణా గ్రావిడెజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ మాట్లాడుతూ.. తాను 16 ఏళ్ల వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డానని, అయితే, అవగాహనతో తొలి దశలోనే చికిత్స తీసుకోవడంతో కోలుకున్నట్లు తెలిపారు. పేద మహిళల ఆరోగ్యానికి మద్దతుగా ఉండే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు. సుధారెడ్డి సేవా కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రశంసించారు. కృష్ణా గ్రావిడెజ్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

సుధారెడ్డి ఫౌండేషన్ – మెయిల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని సుధారెడ్డి ఫౌండేషన్ అధినేత సుధారెడ్డి తెలిపారు. మహిళల్లో క్యాన్సర్ మరణాలు పెరుగుతున్న కారణంగా తొలిదశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గుడ్లవల్లేరు మండలాన్ని P4 కింద తాము దత్తత తీసుకున్నామని, త్వరలో ఈ ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించబోతున్నామని వివరించారు. ప్రపంచ సుందరి వచ్చి మన మధ్యలో కూర్చున్నారంటే ఈ భూమిలో ఏదో మహత్యం ఉందని వ్యాఖ్యానించారు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్గించేలా పింక్ పవర్ రన్ 2.0 కార్యక్రమాన్ని ఆగస్టు 28న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. 
Opal Suchata Hwong
Miss World
Miss Asia Krishna Gravidez
Sudha Reddy Foundation
Breast Cancer Screening
Dokiparru Village
Andhra Pradesh Tourism
Kuchipudi Dance
Pink Power Run
Cancer Awareness

More Telugu News