Rishi Sunak: రిషి సునాక్‌కు హత్య బెదిరింపులు.. యువకుడికి జైలు శిక్ష

Rishi Sunak Receives Death Threats Man Sentenced
  • 21 ఏళ్ల యువకుడికి 14 వారాల జైలు శిక్ష విధించిన కోర్టు
  • జాతి వివక్షతో కూడిన ఈ-మెయిళ్లు పంపిన వైనం
  • మద్యం మత్తులో పంపినట్లు నిందితుడి వాదన
  • రెండేళ్ల పాటు సునాక్‌ను సంప్రదించకుండా నిషేధాజ్ఞలు
బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్‌కు జాతి వివక్షతో కూడిన హత్య బెదిరింపులు పంపిన కేసులో 21 ఏళ్ల యువకుడికి కోర్టు శిక్ష విధించింది. లియామ్ షా అనే ఆ యువకుడికి 14 వారాల జైలు శిక్షతో పాటు, రెండేళ్ల పాటు రిషి సునాక్‌ను సంప్రదించకుండా నిషేధాజ్ఞలు జారీ చేసింది.

గత సంవత్సరం జూన్‌లో రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. లియామ్ షా.. సునాక్ అధికారిక పార్లమెంటరీ ఈ-మెయిల్ చిరునామాకు రెండుసార్లు బెదిరింపు సందేశాలు పంపినట్లు క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీ‌పీ‌ఎస్) వెల్లడించింది. ఈ ఈ-మెయిళ్లను సునాక్ వ్యక్తిగత సహాయకుడు గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు, మొబైల్ ఫోన్ ఆధారంగా ఈ-మెయిల్‌ను ట్రేస్ చేశారు. నిందితుడు బిర్కెన్‌హెడ్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటున్నట్లు గుర్తించి, 2024 సెప్టెంబర్ 3న అతడిని అరెస్ట్ చేశారు. విచారణలో, 'ఆ ఈ-మెయిల్ పంపిన విషయం నాకు గుర్తులేదు. బహుశా నేను మద్యం మత్తులో ఉండి ఉంటాను' అని షా చెప్పినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో విచారణ సమయంలో అతను మౌనంగానే ఉన్నాడు.

లివర్‌పూల్ మేజిస్ట్రేట్ కోర్టులో గత నెలలో జరిగిన విచారణలో లియామ్ షా తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో గత బుధవారం కోర్టు తీర్పు వెలువరించింది. 14 వారాల జైలు శిక్ష విధించినప్పటికీ, దానిని 12 నెలల పాటు సస్పెండ్ చేసింది. ఈ కాలంలో అతను కొన్ని కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. 20 రోజుల పునరావాస కార్యక్రమంతో పాటు, ఆరు నెలల డ్రగ్ రిహాబిలిటేషన్ కోర్సును పూర్తి చేయాలని ఆదేశించింది. "ప్రజాప్రతినిధులను నేరుగా సంప్రదించే అవకాశం ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. దానిని దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్య ప్రక్రియకు హానికరం" అని జిల్లా జడ్జి తిమోతీ బోస్వెల్ తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు.

జాతి వివక్ష దూషణలకు ఈ రోజుల్లో ఎక్కడా స్థానం లేదని సీపీఎస్ సీనియర్ క్రౌన్ ప్రాసిక్యూటర్ మాథ్యూ డిక్సన్ అన్నారు. "భావ ప్రకటనా స్వేచ్ఛను మేం గౌరవిస్తాం. కానీ ఈ కేసులో చేసిన వ్యాఖ్యలు సహనం యొక్క హద్దులు దాటి నేరపూరిత స్థాయికి చేరాయి" అని ఆయన స్పష్టం చేశారు.
Rishi Sunak
Rishi Sunak death threats
Liam Shaw
UK Prime Minister
racist abuse
British politics

More Telugu News