Chandrababu Naidu: ఓ వ్యక్తి తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారం ఇస్తున్నాడు... పేరు చెప్పొద్దన్నాడు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Reveals Anonymous Donor Giving 121 kg Gold to Tirumala
  • మంగళగిరిలో పీ4 సభ
  • హాజరైన సీఎం చంద్రబాబు
  • ఓ అజ్ఞాత భక్తుడి గురించి వెల్లడించిన వైనం
కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి ఓ అజ్ఞాత భక్తుడు అత్యంత భారీ విరాళాన్ని సమర్పించనున్నారు. ఏకంగా 121 కిలోల మేలిమి బంగారాన్ని స్వామివారికి కానుకగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆసక్తికర విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. మంగళగిరిలో మంగళవారం జరిగిన 'పీ4' (ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం) కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ఆ అజ్ఞాత భక్తుడి గురించి కొన్ని వివరాలు పంచుకున్నారు. "నాకు బాగా తెలిసిన ఒక భక్తుడు ఉన్నారు. ఆయన ఒక కంపెనీ పెట్టాలనుకుని, ఎంతో కష్టపడి స్థాపించారు. వ్యాపారంలో విజయవంతం అయ్యారు. ఇటీవల తన కంపెనీలోని 60 శాతం వాటాను విక్రయించారు. దాని ద్వారా ఆయనకు సుమారు 1.5 బిలియన్ డాలర్లు, అంటే మన కరెన్సీలో దాదాపు 6 కోట్ల రూపాయలు వచ్చాయి" అని తెలిపారు.

"ఈ సంపద అంతా తనకు ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్లే వచ్చిందని ఆయన ప్రగాఢంగా విశ్వసించారు. అందుకే స్వామివారికి తిరిగి కృతజ్ఞతగా ఏదైనా సమర్పించుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే 121 కిలోల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నారు. దీని విలువ సుమారు రూ. 150 కోట్లు ఉంటుంది. అయితే, తన పేరును ఎక్కడా బయటపెట్టవద్దని ఆయన ఒక లేఖ ద్వారా స్పష్టంగా కోరారు" అని చంద్రబాబు వివరించారు.

ఈ విరాళం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను చంద్రబాబు పంచుకున్నారు. "సాధారణంగా తిరుమలలో స్వామివారికి రోజుకు సుమారు 120 కిలోల ఆభరణాలు అలంకరిస్తారు. యాదృచ్ఛికంగా ఈ భక్తుడు కూడా 121 కిలోల బంగారం ఇస్తున్నారు. బహుశా ఈ విషయం ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు. ఒకే వ్యక్తి ఇంత పెద్ద మొత్తంలో విరాళం ఇస్తున్నారంటే, అది ఆయనకు దేవుడిపై ఉన్న అపారమైన నమ్మకానికి నిదర్శనం" అని చంద్రబాబు పేర్కొన్నారు.

మంచి పనులు చేస్తేనే జీవితానికి సార్థకత: చంద్రబాబు

మంగళగిరిలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా, రాష్ట్రంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'పీ4' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా 'బంగారు కుటుంబాలు - మార్గదర్శకుల'తో ముఖాముఖి నిర్వహించారు. పుట్టిన ప్రతి ఒక్కరికీ మరణం తప్పదని, కానీ జీవించిన కాలంలో నలుగురికీ గుర్తుండిపోయేలా మంచి పనులు చేస్తేనే జీవితానికి సార్థకత లభిస్తుందని చంద్రబాబు పిలుపునిచ్చారు. సమాజ సేవ, దాతృత్వం వంటి గుణాలను అలవర్చుకోవాలని, ఆ అజ్ఞాత భక్తుడిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఉగాది నాడు లాంఛనంగా ప్రారంభమైన ఈ పీ4 కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల బంగారు కుటుంబాలను, 1.40 లక్షల మంది మార్గదర్శులను గుర్తించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Chandrababu Naidu
Tirumala
Tirumala temple
121 kg gold donation
anonymous donor
Andhra Pradesh
Venkateswara Swamy
TTD
philanthropy
Mangalagiri

More Telugu News