Mounika: శ్రీకాకుళంలో భర్తను చంపి నాటకమాడిన భార్య.. సీసీటీవీ ఫుటేజ్‌తో గుట్టురట్టు

Extra marital affair leads to murder in Patapatnam
  • శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసిన దారుణ హత్య
  • వివాహేతర సంబంధమే హత్యకు ప్రధాన కారణం
  • ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిన భార్య
  • భోజనంలో నిద్రమాత్రలు కలిపి, దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య
  • మద్యం తాగి ప్రమాదంలో చనిపోయినట్లు చిత్రీకరించే ప్రయత్నం
  • సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు
ప్రియుడి మోజులో పడిన ఓ ఇల్లాలు, కట్టుకున్న భర్తనే అత్యంత కిరాతకంగా హత్య చేసింది. ఈ దారుణానికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినా, పోలీసుల లోతైన దర్యాప్తుతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో చోటుచేసుకుంది.

పాతపట్నం మొండిగల వీధికి చెందిన నల్లి రాజు (స్థిరాస్తి వ్యాపారి)కి, మౌనికకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సజావుగా సాగుతున్న వీరి కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. అదే ప్రాంతానికి చెందిన ఉదయ్ కుమార్‌తో మౌనికకు అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్త రాజుకు తెలియడంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను శాశ్వతంగా తొలగించుకోవాలని మౌనిక, ఆమె ప్రియుడు ఉదయ్ నిర్ణయించుకున్నారు.

ఇందుకు పక్కా ప్రణాళిక రచించారు. పథకంలో భాగంగా ఉదయ్ 10 నిద్రమాత్రలు తీసుకొచ్చి మౌనికకు ఇచ్చాడు. వాటి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు, మొదటి రోజు భర్త తినే ఆహారంలో నాలుగు మాత్రలు కలిపింది. రాజు గాఢ నిద్రలోకి జారుకోవడంతో, మరుసటి రోజు హత్యకు రంగం సిద్ధం చేసింది. రెండో రోజు భోజనంలో మిగిలిన ఆరు నిద్రమాత్రలు కలిపి పెట్టగా, రాజు స్పృహ కోల్పోయాడు.

అర్ధరాత్రి సమయంలో మౌనిక తన ప్రియుడికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. ఉదయ్, మరో వ్యక్తితో కలిసి వారి ఇంటికి చేరుకున్నాడు. ముగ్గురూ కలిసి నిద్రమత్తులో ఉన్న రాజు ముఖంపై దిండు పెట్టి అదిమి, ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం వీధి లైట్లు ఆపేసి, మృతదేహాన్ని స్కూటీపై తీసుకెళ్లి ఎస్సీ కాలనీ సమీపంలో పడేశారు. రాజు అతిగా మద్యం తాగి, బండిపై నుంచి పడి చనిపోయినట్లు నమ్మించేందుకు మృతదేహం పక్కన అతని బైక్‌తో పాటు ఓ మద్యం సీసాను కూడా ఉంచారు.

మరుసటి రోజు ఉదయం, స్థానికులు మృతదేహాన్ని గుర్తించడంతో మౌనిక ఏమీ తెలియనట్లు నటిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, మృతదేహంపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోస్టుమార్టం నివేదికలో ఊపిరాడక చనిపోయినట్లు తేలడంతో హత్యగా నిర్ధారించుకున్నారు. అనంతరం ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను, మౌనిక కాల్ డేటాను పరిశీలించగా అసలు బండారం బయటపడింది. పోలీసులు మౌనిక, ఆమె ప్రియుడు ఉదయ్‌తో పాటు హత్యకు సహకరించిన మరో వ్యక్తిని అరెస్టు చేశారు. క్షణికానందం కోసం కట్టుకున్న భర్తను చంపి తల్లి జైలుపాలు కావడంతో, ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
Mounika
Srikakulam crime
husband murder
extra marital affair
Uday Kumar
Patapatnam
sleep pills
CCTV footage
Andhra Pradesh police

More Telugu News