Komatireddy Raj Gopal Reddy: రాజగోపాల్ రెడ్డి ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మునుగోడుకు పట్టిన దరిద్రం పోతుంది: బీఆర్ఎస్ నేతలు

Komatireddy Raj Gopal Reddy LB Nagar Contest Will End Munugodu Troubles Says BRS
  • మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లను విమర్శిస్తే నాలుక చీరేస్తామన్న బీఆర్ఎస్ నేతలు
  • ఒకప్పుడు కూసుకుంట్ల బూట్లు నాకిన వారే ఇప్పుడు విమర్శిస్తున్నారని ఆరోపణ
  • నిధులు తేలేక రాజగోపాల్ రెడ్డి రాజీనామా నాటకాలు ఆడుతున్నారని విమర్శ
మునుగోడు నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని విమర్శించే స్థాయి స్థానిక కాంగ్రెస్ నాయకులకు లేదని, మరోసారి ఆయన గురించి మాట్లాడితే నాలుక చీరేస్తామంటూ బీఆర్ఎస్ నాయకులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సంస్థాన్ నారాయణపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్రి నరసింహ ఈ వ్యాఖ్యలు చేశారు.

గతంలో కూసుకుంట్ల బూట్లు నాకిన కొందరు నాయకులే ఇప్పుడు అధికార పార్టీలో చేరి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మూటలు మోస్తున్నారంటూ ఆయన విమర్శించారు. సొంత అన్నకు మంత్రి పదవి వస్తేనే తట్టుకోలేని వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని నర్రి నరసింహ మండిపడ్డారు. ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసి మునుగోడుకు నిధులు తీసుకురావడం చేతకాకే ఆయన రాజీనామా డ్రామాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు.

"మంత్రి పదవి వస్తుందనే ఆశతో రాజగోపాల్ రెడ్డి ఎల్బీనగర్ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తే మునుగోడు ప్రజలకు పట్టిన దరిద్రం పోతుంది" అని అన్నారు. రాజగోపాల్ రెడ్డి స్థానికుడు కాకపోవడంతో ఆయనకు నియోజకవర్గ అభివృద్ధిపై ఏమాత్రం ప్రేమ లేదని, కేవలం పదవులపైనే ఆయన దృష్టి ఉందని దుయ్యబట్టారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారికి ప్రజలు, కార్యకర్తలు తగిన బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప, రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు శివరాత్రి కవిత విద్యాసాగర్, జక్కిడి, ధనవంత్ రెడ్డి, అంతోజు శంకరాచారి, ఇతర నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 
Komatireddy Raj Gopal Reddy
Munugodu
Kusukuntla Prabhakar Reddy
BRS leaders
Telangana politics
LB Nagar
By elections
Telangana development
Nalgonda district

More Telugu News