Electric Shock: వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంట్‌ షాక్‌.. ఇద్దరు యువకుల మృతి

Two Died After Electric Shock In Bandlaguda Hyderabad
  • బండ్లగూడలో చోటు చేసుకున్న ఘటన
  • ట్రాక్ట‌ర్‌పై వినాయకుడి విగ్రహం తరలిస్తుండగా ప్రమాదం
  • ట్రాక్టర్‌పై ఉన్న భారీ విగ్రహం హై టెన్షన్ విద్యుత్ వైర్లను తాకడంతో దుర్ఘ‌ట‌న‌
హైదరాబాద్‌ రామంతాపూర్‌ విషాద ఘటన మరువకముందే నగరంలో మరో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్‌తో తాజాగా మరో ఇద్దరు యువకులు మృతి చెందారు. వినాయక విగ్రహాన్ని తరలిస్తున్న క్రమంలో యువకులు విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. 

వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన కొందరు యువకులు వినాయక మండపానికి భారీ వినాయ‌కుడి విగ్రహాన్ని ట్రాక్టర్ పై తరలిస్తున్న స‌మ‌యంలో బండ్లగూడ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌పై ఉన్న భారీ విగ్రహం హై టెన్షన్ విద్యుత్ వైర్లను తాకడంతో విద్యుత్ షాక్‌కు గురై టోని (21), వికాస్ (20) అక్కడికక్కడే చ‌నిపోయారు. అఖిల్ అనే మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఈ ఘటనతో ట్రాక్టర్ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో విగ్రహాన్ని అక్కడ నుంచి తొలగించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇక‌, రామంతాపూర్‌లోని గోఖలే నగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల సమయంలో ఆదివారం అర్థరాత్రి ఘరో విషాదం చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రథయాత్ర సందర్భంగా.. శ్రీకృష్ణుడి రథం విద్యుత్ తీగలను తాకి షాక్‌కు గురై ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది స్పృహ కోల్పోయారు. వీరిలో ఐదుగురు ఘటనా స్థలంలోనే చ‌నిపోగా.. మరో నలుగురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  
Electric Shock
Ganesh idol
Hyderabad
Vinayaka Chavithi
electrocution
youth death
accident
Bandalaguda
Ramantapur
high tension wire
festival

More Telugu News