YS Sharmila: కేంద్రానిది ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్: షర్మిల

YS Sharmila Slams Operation Silent Killing by Central Govt
  • విశాఖ స్టీల్‌ను ఉద్దరిస్తామన్న మాటలు పచ్చి అబద్ధమన్న వైఎస్ షర్మిల
  • 44 EOIలకు ప్రైవేట్ కాంట్రాక్టర్లను పిలవడం ప్లాంట్‌ను చంపే కుట్రలో భాగమేనన్న షర్మిల
  • మోదీ దోస్తుల చేతుల్లో స్టీల్ ప్లాంట్‌ను పెట్టాలని చూస్తున్నారన్న షర్మిల
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రానికి ఇది "ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్" అని వ్యాఖ్యానించిన ఆమె, విశాఖ స్టీల్‌ను ఉద్దరిస్తామన్న మాటలు పచ్చి అబద్ధమని మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా షర్మిల కేంద్రం ప్రైవేటీకరణ కుట్రను తీవ్రంగా ఎండగట్టారు.

‘ఉద్ధరించడం అంతా బూటకం. ప్రైవేటీకరణ లేదంటూనే ప్లాంట్‌లో 44 EOIలకు ప్రైవేట్ కాంట్రాక్టర్లను పిలవడం దారుణం. ఇది ప్లాంట్‌ను చంపే కుట్రలో భాగమే’ అని ఆమె పేర్కొన్నారు. అలాగే, ఇటీవల ఐదు వేల మంది కార్మికుల తొలగింపు విషయంలో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 వేల మంది కార్మికులను ఎందుకు తొలగించారు? ఆ పనులను ఎందుకు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు అని ప్రశ్నించారు. పూర్వ వైభవం అంటూ ఇదెక్కడి ద్వంద్వ వైఖరి అని మండిపడ్డారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యపు దుర్మార్గపు చర్యకు ఇది నిదర్శనమని ఆమె అన్నారు. ఇది కూటమి ప్రభుత్వ చేతగానితనానికి అద్దం పడుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ దర్శకత్వంలో ప్లాంట్‌ను దశలవారీగా నాశనం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మోదీ దోస్తుల చేతుల్లో స్టీల్ ప్లాంట్‌ను పెట్టాలని చూస్తున్నారని, దానికి చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని అన్నారు. ప్లాంట్‌లో ప్రైవేట్ కాంట్రాక్టర్లను ఆహ్వానించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.

తాజాగా ఇచ్చిన 44 EOIలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, తొలగించిన ఐదు వేల మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రైవేట్ భాగస్వామ్యాన్ని వెనక్కి తీసుకునే విషయంలో స్టీల్ ప్లాంట్ కార్మికుల పక్షాన కాంగ్రెస్ మరో దశ పోరాటానికి సిద్ధమవుతుందని ఆమె హెచ్చరించారు. 
YS Sharmila
Visakha Steel Plant
Vizag Steel Privatization
Andhra Pradesh Congress
EOI
Privatization Conspiracy
Chandrababu
AP Politics
Steel Plant Workers

More Telugu News