Shubhanshu Shukla: నరేంద్ర మోదీతో శుభాంశు శుక్లా భేటీ... ప్రధానికి వ్యోమగామి అపురూప కానుక

Shubhanshu Shukla Meets Narendra Modi Presents Space Souvenir
  • ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన వ్యోమగామి శుభాంశు శుక్లా
  • అంతరిక్షంలోకి తీసుకెళ్లిన జాతీయ జెండాను ప్రధానికి బహూకరణ
  • తన యాత్ర అనుభవాలను, ప్రయోగాల వివరాలను పంచుకున్న శుక్లా
  • వ్యోమగామిని అభినందించిన ప్రధాని మోదీ
  • పార్లమెంటులోనూ శుభాన్షు శుక్లాపై ప్రశంసల వర్షం
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన భారత వ్యోమగామి, వాయుసేన టెస్ట్ పైలట్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. దేశ రాజధానిలోని ప్రధాని అధికారిక నివాసంలో జరిగిన ఈ సమావేశంలో, శుక్లా ఒక అపురూపమైన కానుకను మోదీకి అందజేశారు. తన చారిత్రాత్మక 'యాక్స్-4' మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లిన త్రివర్ణ పతాకాన్ని ఆయన ప్రధానికి బహూకరించారు. మానవసహిత అంతరిక్ష యాత్రలో భారత్ సాధిస్తున్న ప్రగతికి ఈ ఘటన ప్రతీకగా నిలిచింది.

ఈ సందర్భంగా శుభాంశు శుక్లా తన అంతరిక్ష యాత్రలోని ఉత్కంఠభరిత క్షణాలను, ఎదురైన సవాళ్లను ప్రధానికి వివరించారు. అంతర్జాతీయ వ్యోమగాములతో కలిసి సుదీర్ఘకాలం అంతరిక్ష కేంద్రంలో గడిపిన అనుభవాలను పంచుకున్నారు.

అక్కడ గురుత్వాకర్షణ లేని స్థితిలో మానవ శరీరంపై కలిగే మార్పులు, స్పేస్‌లో వ్యవసాయానికి సంబంధించిన టెక్నాలజీ వంటి కీలకమైన శాస్త్రీయ ప్రయోగాల వివరాలను తెలియజేశారు. ఈ ప్రయోగాలు భవిష్యత్తులో భారత్ చేపట్టనున్న ప్రతిష్ఠాత్మక 'గగన్‌యాన్' మిషన్‌కు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.

శుక్లా సాహసాన్ని, దేశభక్తిని ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తారు. కేవలం సాంకేతిక విజయాన్నే కాకుండా, యువతరంలో స్ఫూర్తిని రగిలించారని అభినందించారు.

మరోవైపు, పార్లమెంటు సైతం శుభాంశు శుక్లా చారిత్రాత్మక విజయంపై ప్రశంసలు కురిపించింది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. భారత అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో శుక్లా మిషన్ ఒక సువర్ణాధ్యాయమని కొనియాడారు. అయితే ఈ ప్రత్యేక చర్చలో ప్రతిపక్షాలు పాల్గొనలేదు. కానీ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ 'ఎక్స్' వేదికగా శుక్లాను అభినందించారు. "ప్రతి భారతీయుడు గర్వపడేలా శుభాంశు శుక్లా ఈ యాత్రను పూర్తి చేశారు. మన గగన్‌యాన్ కార్యక్రమానికి ఇది ఒక కీలకమైన మైలురాయి" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
Shubhanshu Shukla
Narendra Modi
ISS
Indian astronaut
Gaganyaan mission
space mission

More Telugu News