Telangana Government: కాళేశ్వరంలో నీళ్లు లేకపోయినా...!: ప్రాజెక్టుల్లోని నీటిపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

Telangana Government Statement on Projects Water Levels Despite Kaleshwaram Issues
  • గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో జలకళ
  • నిండిన ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులు
  • మిడ్ మానేరు, ఎల్ఎండీలో పెరుగుతున్న నీటి నిల్వలు
కాళేశ్వరం ప్రాజెక్టులో నీరు లేకపోయినా, మేడిగడ్డ ఆనకట్ట కుంగినా, అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయలేకపోయినప్పటికీ, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి బేసిన్‌‍లోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులు నిండటంతో ఉత్తర తెలంగాణలో వరద కాలువలతో పాటు మిడ్ మానేరు, ఎల్‌ఎండీలలో క్రమంగా నీటి నిల్వలు పెరుగుతున్నట్లు తెలిపింది.

ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మహారాష్ట్ర, ఎగువన గోదావరి పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో ఎస్సారెస్పీకి మూడు రోజులుగా నీటి ప్రవాహం కొనసాగుతోంది. సోమవారం మధ్యాహ్నం లక్షా 25 వేల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో ఉండగా, ఔట్ ఫ్లో 76,867 క్యూసెక్కులకు పైగా ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 18.92 టీఎంసీలకు చేరుకుంది. ఎల్లంపల్లి గరిష్ఠ నీటి సామర్థ్యం 148 మీటర్లు కాగా, ప్రస్తుతం 147.55 మీటర్లకు చేరుకుంది.

ఎస్సారెస్పీ పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో 48,293 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. హైదరాబాద్ తాగునీటితో పాటు ఎన్టీపీసీకి నీటిని విడుదల చేస్తున్నారు. మిడ్ మానేరులో ప్రస్తుతం నీటిమట్టం 309.63 మీటర్లు ఉండగా, 311.14 మీటర్లకు చేరితే ఒక పంపును ప్రారంభిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఇన్‌ఫ్లో ప్రకారం ఎల్లుండి నుంచి పంపింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Telangana Government
Kaleshwaram project
Godavari basin
Telangana floods
SRSP project

More Telugu News