Prakhar Jain: రేపు తీరాన్ని దాటనున్న వాయుగుండం... ఏపీకి వర్ష సూచన

Prakhar Jain warns of Cyclone landfall and Rain for Andhra Pradesh
  • బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం
  • రేపు ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశం
  • దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే సూచన
  • కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలకు ఛాన్స్
  • తీరం వెంబడి గంటకు 60 కి.మీ వేగంతో గాలులు
  • మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరిక
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడి కోస్తాంధ్ర వైపు దూసుకొస్తోంది. ఇది మంగళవారం ఉదయానికి వాయుగుండంగా మారి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు.

వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. పరిస్థితులు ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున, మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లరాదని ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ వాయుగుండం కారణంగా మంగళవారం కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు.

ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రం 5 గంటల సమయానికి అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో అత్యధికంగా 73 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, మన్యం జిల్లా గుళ్లసీతారామపురంలో 66 మి.మీ, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో 60.2 మి.మీ, అల్లూరి జిల్లా కొత్తూరులో 59.5 మి.మీ చొప్పున వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.
Prakhar Jain
Andhra Pradesh
Cyclone
Heavy Rainfall
Coastal Andhra
APSDMA
Weather Forecast
Bay of Bengal
Alluri Sitarama Raju district
Fishermen Warning

More Telugu News