Hyderabad: హైద‌రాబాద్‌లో శ్రీకృష్ణాష్ట‌మి వేడుక‌ల్లో అప‌శ్రుతి.. ఐదుగురి మృతి!

Electric Shock Kills Five During Sri Krishna Celebrations in Hyderabad
  • రామంతాపూర్‌లోని గోకులేన‌గ‌ర్‌లో ఆదివారం అర్ధరాత్రి ఘ‌ట‌న‌
  • శ్రీకృష్ణాష్ట‌మి వేడుక‌ల్లో భాగంగా నిన్న రాత్రి స్థానికంగా ర‌థ యాత్ర‌
  • ర‌థాన్ని లాగుతున్న వాహ‌నం చెడిపోవ‌డంతో దాన్ని ప‌క్క‌కు నిలిపివేసిన యువ‌కులు
  • ర‌థాన్ని చేతుల‌తో లాగుతూ ముందుకు తీసుకెళ్లే క్ర‌మంలో 9 మందికి విద్యుద్ఘాతం
  • ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి.. మ‌రో న‌లుగురికి ఆసుప‌త్రిలో చికిత్స‌
హైద‌రాబాద్‌లో శ్రీకృష్ణాష్ట‌మి వేడుక‌ల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఊరేగింపు ర‌థానికి విద్యుత్ తీగ‌లు త‌గ‌ల‌డంతో క‌రెంట్ షాక్ కార‌ణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం అర్ధరాత్రి రామంతాపూర్‌లోని గోకులేన‌గ‌ర్‌లో ఈ విషాద ఘ‌ట‌న జ‌రిగింది. శ్రీకృష్ణాష్ట‌మి వేడుక‌ల్లో భాగంగా నిన్న రాత్రి స్థానికంగా ర‌థాన్ని ఊరేగించారు. అయితే, ర‌థాన్ని లాగుతున్న వాహ‌నం చెడిపోవ‌డంతో దాన్ని ప‌క్క‌కు నిలిపివేసిన యువ‌కులు.. ర‌థాన్ని చేతుల‌తో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. 

ఈ క్ర‌మంలో ర‌థానికి విద్యుత్ తీగ‌లు త‌గిలాయి. దాంతో ర‌థాన్ని లాగుతున్న 9 మంది యువ‌కులు క‌రెంట్ షాక్‌కు గుర‌య్యారు. స్పృహ‌త‌ప్పి ప‌డిపోయిన వారిని వెంట‌నే స్థానికులు స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కానీ, అప్ప‌టికే ఐదుగురు చ‌నిపోయిన‌ట్లు వైద్యులు ధ్రువీక‌రించారు. మ‌రో నలుగురికి ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయ‌ప‌డిన వారిలో కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి గ‌న్‌మెన్ శ్రీనివాస్ కూడా ఉన్న‌ట్లు స‌మాచారం. 

మృతుల‌ను రుద్ర‌వికాస్‌(39), కృష్ణ యాద‌వ్‌(21), శ్రీకాంత్ రెడ్డి(35), రాజేంద్ర‌రెడ్డి(45), సురేశ్ యాద‌వ్ (34)గా గుర్తించారు. వారి మృత‌దేహాల‌ను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.       
Hyderabad
Sri Krishna Janmashtami
Ramantapur
Gokulenagar
Electric shock
Kishan Reddy
Accident
Telangana
Rath yatra
Electric Shock

More Telugu News