Roja: జగన్ కు సవాళ్లు విసిరారు... గేమ్ చేంజర్, వీరమల్లు సినిమాలు ఏమయ్యాయి?: రోజా

Roja challenges TDP on Junior NTR movie threats
  • అనంతపురం ఎమ్మెల్యే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వివాదం 
  • రోజా స్పందన
  • అరచేతిని అడ్డంపెట్టి సూర్యుడ్ని ఆపలేరంటూ వ్యాఖ్యలు
టాలీవుడ్ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు, ఆయన నటించిన వార్-2 సినిమా ఎలా ఆడుతుందో చూస్తామని అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించినట్టుగా వార్తలు రావడం... దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమనడం తెలిసిందే. ఎన్టీఆర్ అభిమానులు అనంతపురంలో ఎమ్మెల్యే ప్రసాద్ ఫ్లెక్సీలు ధ్వంసం చేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై వైసీపీ మహిళా నేత రోజా స్పందించారు. 

"ఇవేమైనా ఈవీఎంలు అనుకున్నారా... మార్చివేసి మోసం చేయడానికి! సినిమాలు ఆడనివ్వబోమని హెచ్చరించడానికి వీళ్లెవరు? పెద్ద ఎన్టీఆర్ అభిమానులు, చిన్న ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా చిన్న ఎన్టీఆర్ సినిమాలు చూస్తారు. వీళ్లు (టీడీపీ ఎమ్మెల్యే ప్రసాద్) చిన్న ఎన్టీఆర్ సినిమాలు ఆపేస్తాం అని బెదిరించడం చూస్తుంటే, అరచేతిని అడ్డంపెట్టి సూర్యుడ్ని ఆపేస్తాం అన్నంత హాస్యాస్పదంగా ఉంది. 

సినిమా బాగుంటే ఎవరూ ఏం చేయలేరు, ఎవరూ అడ్డుకోలేరు. సినిమా బాగాలేకపోతే ఎవరూ ఆడించలేరు. హరిహర వీరమల్లు విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఎమ్మెల్యేలు తలకిందులుగా తపస్సులు చేసి, టికెట్లు ఫ్రీగా ఇస్తే కూడా వాళ్ల అభిమానులే థియేటర్లకు రాలేక ఏడుస్తూ ఆ సినిమాను ఎలా తిట్టారో మనం కళ్లారా చూశాం. ఇప్పటికైనా వాళ్లు తెలుసుకోవాల్సింది... రాజకీయాలు రాజకీయల్లా చేయండి. సినిమాల విషయం సినిమావాళ్లు చూసుకుంటారు. 

సినిమా ఫంక్షన్లలో జగన్ ను తిట్టడం, సవాళ్లు విసరడం చేస్తే... గేమ్ చేంజర్, హరిహరవీరమల్లు వంటి  సినిమాలు ఏమయ్యాయో మనం కళ్లారా చూశాం. కాబట్టి, సినిమాను రాజకీయాన్ని మిక్స్ చేయొద్దు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు... ఆయన సినిమాలు చేసుకుంటున్నారు. ఆయన సినిమాలు ఎలా హిట్టవుతున్నాయి, ఆయన పెర్ఫార్మెన్స్ కు ఇంటర్నేషనల్ లెవల్లో ఏ విధంగా అవార్డులు  వస్తున్నాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం. కానీ, మైక్ లు ఉన్నాయని, పచ్చ చానళ్లు ఉన్నాయని, తాము ఏం చెప్పినా వేస్తారని అనుకుంటే... చూసే జనం నవ్వుతారు" అంటూ రోజా పేర్కొన్నారు.
Roja
Junior NTR
Daggubati Prasad
War 2 Movie
Hari Hara Veera Mallu
Game Changer movie
TDP
YSRCP
Andhra Pradesh Politics
Tollywood

More Telugu News