Kokila: ఆటోలో పురుటి నొప్పులు.. ప్రసవం చేసిన మహిళా కానిస్టేబుల్

Woman Constable Kokila Delivers Baby in Auto on Roadside
––
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా వేళంపాళ్యంలో ఆసుపత్రికి వెళుతున్న నిండు గర్భిణికి మార్గమధ్యంలోనే నొప్పులు మొదలయ్యాయి. ఆసుపత్రికి వెళ్లేంత సమయం లేకపోవడంతో దగ్గర్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ స్పందించారు. ఆటోలోనే ఆమెకు పురుడు పోసి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు. వేళంపాళ్యం పోలీసుస్టేషన్‌ పరిధి తిరుమురుగన్‌పూండి రింగ్‌ రోడ్డులో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుందీ ఘటన.
 
స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో రింగ్ రోడ్డు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. అదేసమయంలో అటుగా వచ్చిన ఆటోలో ఒడిశా రాష్ట్రానికి చెందిన భారతి అనే యువతి పురుటినొప్పులతో బాధపడుతుండటం గమనించారు. అప్పటికే బిడ్డ సగం బయటికి రావడంతో ఆసుపత్రికి తరలించే సమయం లేకపోయింది. దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ కోకిల ముందుకువచ్చి భారతికి పురుడు పోశారు.

నర్సింగ్ కోర్సు చదివిన కోకిల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరకముందు ఆసుపత్రిలో పనిచేశారు. ఆ అనుభవంతోనే భారతికి పురుడు పోసినట్లు కోకిల తెలిపారు. ప్రసవం తర్వాత తల్లీబిడ్డలను తిరుప్పూర్ లోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో చేర్చామని, ఇద్దరూ క్షేమంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా, సమయస్ఫూర్తితో వేగంగా స్పందించి గర్భిణికి పురుడు పోసిన కోకిలను ఉన్నతాధికారులు అభినందించారు.
Kokila
Tamil Nadu
Tiruppur
Woman Constable
Delivery in Auto
Police Constable
ESI Hospital
Nursing Course
Emergency Childbirth

More Telugu News