BK Hariprasad: ఆరెస్సెస్‌ను ఇండియన్ తాలిబన్ అన్న కాంగ్రెస్ నేత.. ‘మహాత్మాగాంధీ’తో బదులిచ్చిన బీజేపీ

BK Hariprasad calls RSS Indian Taliban BJP responds with Mahatma Gandhi
  • దేశంలో శాంతికి ఆరెస్సెస్ విఘాతం కలిగిస్తోందన్న బీకే హరిప్రసాద్ 
  • కాంగ్రెస్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం, ఘాటుగా రిప్లై
  • జాతీయవాద సంస్థలను కాంగ్రెస్ అవమానిస్తోందన్న బీజేపీ
  • చరిత్రను వక్రీకరించడంలో బీజేపీ, ఆరెస్సెస్ నిపుణులన్న హరిప్రసాద్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్)ను ‘ఇండియన్ తాలిబన్లు’గా అభివర్ణిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత బీకే హరిప్రసాద్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆరెస్సెస్‌పై ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో హరిప్రసాద్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై అధికార బీజేపీ తీవ్రంగా స్పందించింది. జాతీయవాద సంస్థలను అవమానించడం, నిషేధిత సంస్థలను ప్రేమించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని ఘాటుగా బదులిచ్చింది.

కర్ణాటక ఎమ్మెల్సీ అయిన బీకే హరిప్రసాద్ మాట్లాడుతూ "దేశంలో శాంతికి భంగం కలిగించేందుకు వారు (ఆరెస్సెస్) ప్రయత్నిస్తున్నారు. నేను ఆరెస్సెస్‌ను తాలిబన్లతో మాత్రమే పోలుస్తాను. వాళ్లు భారతీయ తాలిబన్లు. అలాంటి వారిని ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి ప్రశంసిస్తున్నారు" అని విమర్శించారు. స్వాతంత్ర్య పోరాటంలో ఒక్క సంఘీ అయినా పాల్గొన్నారా? అని ఆయన ప్రశ్నించారు. "ఆరెస్సెస్ ఇప్పటికీ రిజిస్టర్డ్ సంస్థ కాకపోవడం సిగ్గుచేటు. వారికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. రాజ్యాంగం ప్రకారం దేశంలో పనిచేయాలనుకునే ఏ ఎన్జీవో అయినా నమోదు చేసుకోవాలి" అని హరిప్రసాద్ పేర్కొన్నారు. చరిత్రను వక్రీకరించడంలో బీజేపీ, ఆరెస్సెస్ లు నిపుణులని ఆయన ఆరోపించారు. దేశ విభజనకు కాంగ్రెస్ కారణమని నిందలు వేస్తున్నారని, కానీ బెంగాల్ విభజనకు తొలి తీర్మానం ప్రవేశపెట్టింది ఏకే ఫజలుల్ హక్, శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని ఆయన గుర్తుచేశారు.

శుక్రవారం తన 12వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఆరెస్సెస్ గురించి మాట్లాడుతూ.. "వంద సంవత్సరాల క్రితం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనే సంస్థ పుట్టింది. వందేళ్ల దేశ సేవ ఒక గర్వకారణమైన సువర్ణాధ్యాయం. 'వ్యక్తి నిర్మాణ్ సే రాష్ట్ర నిర్మాణ్' అనే సంకల్పంతో స్వయంసేవకులు మాతృభూమి సేవకు జీవితాలను అంకితం చేశారు. ఒక రకంగా ఆరెస్సెస్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జీవో" అని కొనియాడారు.

హరిప్రసాద్ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తీవ్రంగా స్పందించారు. "కాంగ్రెస్ కు భారత సైన్యంలో గూండాలు, ఆరెస్సె‌స్‌లో తాలిబన్లు కనిపిస్తారు. జాతీయవాద సంస్థలను, రాజ్యాంగబద్ధ సంస్థలను, సనాతన ధర్మాన్ని అవమానించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారింది. మహాత్మా‌గాంధీ, జయప్రకాశ్ నారాయణ్ ఆరెస్సెస్‌ను ఎందుకు ప్రశంసించారు? కాంగ్రెస్‌కు చెందిన ప్రణబ్ ముఖర్జీ ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయాన్ని ఎందుకు సందర్శించారు?" అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆలోచనా విధానమే తాలిబన్ల మనస్తత్వమని ఆయన దుయ్యబట్టారు.
BK Hariprasad
RSS
Indian Taliban
BJP
Narendra Modi
Congress
Mahatma Gandhi
Shehzad Poonawalla
Rashtriya Swayamsevak Sangh

More Telugu News