Kathua: జమ్మూకశ్మీర్‌లో మళ్లీ జల ప్రళయం.. కథువాలో నలుగురు బలి

Kathua Four Killed in Jammu Kashmir Flood Disaster
  • ఆకస్మిక వరదలతో ఓ గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్
  • రైల్వే ట్రాక్, జాతీయ రహదారి ధ్వంసం
  • సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికార యంత్రాంగం
  • ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రజలకు హెచ్చరిక
జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత రాత్రి కురిసిన భారీ వర్షాలు నలుగురి ప్రాణాలను బలితీసుకున్నాయి. మరికొందరు గాయపడ్డారు. వరద ప్రవాహం కారణంగా ఒక గ్రామానికి బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది. రైల్వే ట్రాక్‌తో పాటు జాతీయ రహదారి కూడా దెబ్బతిన్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌పైనా వరద ప్రభావం పడిందని ఆయన ‘ఎక్స్’లో వెల్లడించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, పౌర, సైనిక, పారామిలిటరీ బలగాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని ఆయన పేర్కొన్నారు.

ఈ దుర్ఘటనపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని, బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.

భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో కఠువా జిల్లా యంత్రాంగం ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. నదులు, వాగులు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉన్నందున అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Kathua
Jammu Kashmir floods
Kathua rain
Jitendra Singh
Omar Abdullah
heavy rainfall
landslides
natural disaster
flood alert
rescue operations

More Telugu News