Kesineni Chinni: ఏకగ్రీవంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక .. అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని

Kesineni Chinni Elected as Andhra Cricket Association President
  • తాడేపల్లిలోని విజయవాడ క్లబ్ లో ఏసీఏ నూతన కార్యవర్గ ఎన్నిక
  • అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్, కార్యదర్శిగా రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ ఎన్నిక
  • రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌లో నిన్న జరిగిన సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సాంకేతిక కారణాల వల్ల ఉపాధ్యక్ష పదవి ఎన్నిక వాయిదా పడింది. మొత్తం 34 మందితో నూతన కమిటీ కొలువుదీరింది.

ఈ కమిటీకి మూడు సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేస్తుంది. మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు.

ఏపీ క్రికెట్‌కు నూతన దిశలో అభివృద్ధి: కేశినేని చిన్ని
ఈ సందర్భంగా ఏసీఏ నూతన అధ్యక్షుడు కేశినేని చిన్ని మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచిన కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ అభివృద్ధికి, స్టేడియాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని ఆయన అన్నారు. అంతర్జాతీయ స్థాయి క్రికెట్ క్రీడాకారులను ఏపీ నుంచి తయారు చేయడమే లక్ష్యమని, క్రీడాకారులకు అవసరమైన కోచింగ్, సహాయక సిబ్బందిని అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం విశాఖపట్నం స్టేడియంలో జరుగుతున్న ఏపీఎల్ సీజన్-4 విజయవంతంగా సాగుతోందని తెలిపారు. ఏసీఏ ప్రతిష్ఠను మరింతగా పెంచేలా పని చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 
Kesineni Chinni
Andhra Cricket Association
ACA
APL Season 4
Sana Satish
Nimmagadda Ramesh Kumar
Vijayawada
Andhra Pradesh Cricket
Cricket Development
AP Cricket

More Telugu News