Vladimir Putin: అమెరికాతో వాణిజ్యం... రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Vladimir Putin on US Russia Trade Relations
  • ట్రంప్ హయాంలో రష్యాతో వాణిజ్యం 20 శాతం పెరిగిందన్న పుతిన్
  • రష్యా చమురు కొనుగోలుపై భారత్‌కు ట్రంప్ ఊరట
  • సుంకాల విధింపుపై వెనక్కి తగ్గే అవకాశం ఉందని సూచన
అమెరికా, రష్యా సంబంధాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అలస్కాలో జరిగిన శిఖరాగ్ర సమావేశం సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ, ట్రంప్ పరిపాలనలో అమెరికా, రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 20 శాతం పెరిగిందని ఆయన తెలిపారు.

"ఇది కేవలం సాంకేతికపరమైన సంఖ్యే అయినప్పటికీ, వాస్తవానికి వాణిజ్యం వృద్ధి చెందింది. సహకారానికి మాకు చాలా ఆసక్తికరమైన రంగాలు ఉన్నాయి" అని పుతిన్ అన్నారు. ఇంధనం, డిజిటల్ టెక్నాలజీ, అంతరిక్షం వంటి రంగాల్లో కలిసి పనిచేసేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు.

ట్రంప్ వైఖరిలో మార్పు

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై కఠినమైన సుంకాలు విధిస్తామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ తర్వాత తన వైఖరిలో మార్పు వచ్చినట్లు సంకేతాలిచ్చారు. భారత్‌పై ‘సెకండరీ టారిఫ్’లు విధించాల్సిన అవసరం బహుశా రాకపోవచ్చని ఆయన సూచనప్రాయంగా తెలిపారు.

"భారత్ వంటి ఒక పెద్ద ఆయిల్ క్లయింట్‌ను రష్యా కోల్పోయింది. నేను సెకండరీ టారిఫ్ విధిస్తే, అది వారికి చాలా నష్టాన్ని కలిగిస్తుంది. అవసరమైతేనే ఆ పని చేస్తాను. బహుశా చేయాల్సిన అవసరం రాకపోవచ్చు" అని ఆయన పేర్కొన్నారు. ముందుగా ప్రకటించిన ప్రకారం, రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై 25 శాతం సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది.

పుతిన్ తో ట్రంప్ సమావేశం విజయవంతం కాకపోతే భారత్‌పై సుంకాలు మరింత పెరిగే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ కొద్ది రోజుల క్రితం హెచ్చరించారు. అయితే, రష్యాతో ఆర్థిక సహకారం వల్ల తమకే ప్రయోజనం ఉంటుందని అమెరికా భావిస్తున్నట్లు రష్యా వార్తా సంస్థ ‘టాస్’ పేర్కొంది.
Vladimir Putin
Russia
United States
US Russia trade
Donald Trump
India
Oil imports
Tariffs

More Telugu News