Rajinikanth: 'రజని' పేరు కనిపించగానే థియేటర్లలో ఎలా ఉంటుందో నాకు తెలుసు: పవన్ కల్యాణ్

Pawan Kalyan Congratulates Rajinikanth on 50 Years
సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న రజనీకాంత్
సూపర్ స్టార్‌కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
రజనీ స్టైల్, నటన ఎప్పటికీ ప్రత్యేకం అని ప్రశంస
ఆయన ఆధ్యాత్మిక చింతన గొప్పదన్న ఉప ముఖ్యమంత్రి
మరిన్ని మంచి చిత్రాలు చేయాలని ఆకాంక్ష
భారతీయ చలనచిత్ర రంగంలో విశేష ఖ్యాతి గడించిన అగ్ర కథానాయకుడు, సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నటుడిగా రజినీకాంత్ 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను అభినందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. సినీ రంగంలో స్వర్ణోత్సవం జరుపుకుంటున్న రజినీకాంత్‌కు ఇది అరుదైన గౌరవమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

వెండి తెరపై ‘సూపర్ స్టార్ రజని’ అని టైటిల్ కనిపించగానే థియేటర్ ఏ విధంగా మారుమోగుతుందో పలుమార్లు చెన్నైలో చూశాను. తరాలు మారుతున్నా సినీ ప్రియుల్లో ఆ ఆనందోత్సాహాల వన్నె తగ్గలేదు. ఆ స్థాయి అభిమానులను దక్కించుకున్న అగ్రశ్రేణి కథానాయకుడు రజనీకాంత్ గారు నటుడిగా 5 దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. సినీ జీవితంలో స్వర్ణోత్సవం చేసుకుంటున్న సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

నటుడిగా ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ప్రతినాయక పాత్ర పోషించినా, కథానాయకుడిగా మెప్పించినా రజనీకాంత్ గారు తనదైన స్టైల్ ను చూపించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. ఆయన నడకలో, సంభాషణలు పలకడంలో, హావభావ విన్యాసంలో ప్రత్యేకతను చూపిస్తారు. రజనీకాంత్ గారి స్టైల్స్ కి నవతరం ప్రేక్షకుల్లోనూ అభిమానులున్నారు. 

నటుడిగా శిఖరాగ్ర స్థాయికి చేరిన రజనీకాంత్ గారు మహావతార్ బాబాజీ భక్తుడిగా ఆధ్యాత్మిక విషయాలపై, యోగా సాధనపై ప్రత్యేక శ్రద్ధ చూపడం ఆయనలో భక్తి భావాన్ని, ధార్మిక విశ్వాసాలను తెలియచేస్తుంది. నటుడిగా స్వర్ణోత్సవ సంబరాలు చేసుకుంటున్న రజనీకాంత్ గారు మరిన్ని విభిన్న పాత్రలతో సినీ ప్రియులను మెప్పించాలని ఆకాంక్షిస్తున్నాను. రజనీకాంత్ గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను" అంటూ పవన్ కల్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. 
Rajinikanth
Pawan Kalyan
Rajinikanth 50 years
Indian cinema
Superstar Rajinikanth
Tollywood
Chennai
Mahavatar Babaji
Yoga
Andhra Pradesh

More Telugu News