War 2: బాక్సాఫీస్ వద్ద 'వార్ 2' జోరు.. రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్ లోకి ప్రవేశం

War 2 Box Office Roars Enters 100 Crore Club in Two Days
  • హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మ్యాజిక్
  • రెండు రోజుల్లోనే రూ. 108 కోట్లు వసూలు చేసిన 'వార్ 2'
  • స్వాతంత్ర్య దినోత్సవం నాడు భారీగా పెరిగిన కలెక్షన్లు
  • తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమాకు విశేష ఆదరణ
  • రజనీకాంత్ 'కూలీ'తో పోటీ పడుతున్న 'వార్ 2'
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 108 కోట్ల నెట్ వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. ముఖ్యంగా రెండో రోజు కలెక్షన్లలో అనూహ్యమైన పెరుగుద‌ల‌ కనిపించింది.

విడుదలైన మొదటి రోజు మిశ్రమ స్పందనతో రూ. 51.50 కోట్లు మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా, స్వాతంత్ర్య దినోత్సవమైన రెండో రోజు పుంజుకుంది. ఒక్కరోజే ఏకంగా రూ. 56.50 కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ భారీ వసూళ్లతో 2025లో అత్యంత వేగంగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాలలో ఒకటిగా నిలిచింది.

ఈ సినిమాలో హృతిక్ రోషన్ ‘కబీర్’ అనే ఏజెంట్‌గా కనిపించగా, జూనియర్ ఎన్టీఆర్ ప్రతినాయకుడి పాత్రలో అద్భుతంగా నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఉత్తరాదిలో హృతిక్ స్టార్‌డమ్ సినిమాకు ప్లస్ అవ్వగా, తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ఇమేజ్ భారీ వసూళ్లకు కారణమవుతోంది. రజనీకాంత్ నటించిన 'కూలీ' సినిమాతో పోటీ ఉన్నప్పటికీ 'వార్ 2' తన సత్తా చాటుతోంది.

యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. కియారా అద్వానీ, అనిల్ కపూర్, అశుతోశ్‌ రాణా ఇతర కీలక పాత్రలలో నటించారు. భారీ యాక్షన్ ఘట్టాలు, ఉన్నత నిర్మాణ విలువలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
War 2
Hrithik Roshan
Jr NTR
Junior NTR
Bollywood
Tollywood
Box Office Collection
Ayan Mukerji
Yash Raj Films
Kiara Advani

More Telugu News