Vladimir Putin: ట్రంప్ అప్పుడు అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్‌తో యుద్ధం జరిగేదే కాదు: పుతిన్

Putin says Ukraine war wouldnt happen if Trump was president
  • అలాస్కాలో ముగిసిన ట్రంప్-పుతిన్ శిఖరాగ్ర సమావేశం
  • ఉక్రెయిన్ యుద్ధంపై ఒప్పందం లేకుండానే ముగిసిన చర్చలు
  • ఐదేళ్ల తర్వాత తొలిసారి ముఖాముఖి భేటీ అయిన ఇరు దేశాధి నేతలు
  • రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయన్న రష్యా అధ్యక్షుడు
  • మరోసారి మాస్కోలో కలుద్దామంటూ ట్రంప్‌కు పుతిన్ ఆహ్వానం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2022లో అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్ యుద్ధం అసలు జరిగేదే కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల తర్వాత అలాస్కాలో ట్రంప్‌తో తొలిసారి ముఖాముఖి సమావేశమైన సందర్భంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాను అధ్యక్షుడిగా ఉంటే రష్యా దాడి చేసేది కాదంటూ ట్రంప్ చాలాకాలంగా చేస్తున్న వాదనను పుతిన్ సమర్థించారు.

అలాస్కా వేదికగా శుక్రవారం ట్రంప్, పుతిన్‌ల మధ్య జరిగిన ఉన్నతస్థాయి సమావేశం ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ చర్చల్లో నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే విషయంపై ఏకాభిప్రాయం కుదరలేదు. సమావేశం అనంతరం పుతిన్ మాట్లాడుతూ.. చర్చల్లో ఉక్రెయిన్ అంశమే ప్రధానంగా ఉందని తెలిపారు. 

"సంఘర్షణ వెనుక ఉన్న అసలు కారణాలను అర్థం చేసుకోవాలన్న ట్రంప్ కోరికను నేను అభినందిస్తున్నాను. యుద్ధాన్ని ముగించడానికి రష్యా చిత్తశుద్ధితో ఉంది. అయితే, దాని మూల కారణాలను తొలగించి, మా ఆందోళనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి" అని పుతిన్ స్పష్టం చేశారు.

చర్చల అనంతరం ఇద్దరు నేతలు మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. ‘శాంతిని అనుసరించడం’ అనే బ్యానర్‌ ముందు నిలబడి ట్రంప్ మాట్లాడుతూ.. "మేం చాలా అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చాం. కొన్ని పెద్ద విషయాలు పూర్తిగా పరిష్కారం కాలేదు, కానీ పురోగతి సాధించాం. ఒప్పందం కుదిరే వరకు ఏదీ కుదిరినట్లు కాదు" అని అన్నారు. 

కొంతకాలంగా ఇరు దేశాల మధ్య ఉన్న క్లిష్ట పరిస్థితులు తొలగిపోయి, ఇప్పుడు మంచి ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడ్డాయని పుతిన్ పేర్కొన్నారు. సమావేశం ముగింపులో, ‘తర్వాతిసారి మాస్కోలో కలుద్దాం’ అని పుతిన్ సరదాగా అనగా.. ‘ఓహ్, అది ఆసక్తికరం. ఈ విషయంలో నాపై విమర్శలు రావొచ్చు, కానీ అది జరిగే అవకాశం ఉంది’ అని ట్రంప్ బదులివ్వడం గమనార్హం.
Vladimir Putin
Putin
Donald Trump
Trump
Russia Ukraine war
Ukraine war
Russia
United States
Alaska meeting
US relations

More Telugu News