Taylor Stanberry: అమెరికాలో కొండచిలువల వేట... విజేతగా నిలిచిన మహిళ

Taylor Stanberry wins Florida Python Challenge
  • ఫ్లోరిడా పైథాన్ ఛాలెంజ్‌లో మహిళ సంచలనం
  • ఒక్కతే 60 కొండచిలువలను పట్టిన టేలర్ స్టాన్‌బెర్రీ
  • గ్రాండ్ ప్రైజ్‌గా 10,000 డాలర్లు కైవసం
  • మొత్తం 294 పైథాన్లను తొలగించిన వాలంటీర్లు
  • పర్యావరణ పరిరక్షణకే ఈ పోటీ నిర్వహణ
  • అమెరికా, కెనడా నుంచి 900 మందికి పైగా పోటీ
ఫ్లోరిడాలో జరిగిన కొండచిలువల వేటలో ఓ మహిళ సంచలనం సృష్టించింది. కేవలం 10 రోజుల్లో ఏకంగా 60 బర్మీస్ కొండచిలువలను పట్టుకుని, ఫ్లోరిడా పైథాన్ ఛాలెంజ్‌-2025లో విజేతగా నిలిచింది. టేలర్ స్టాన్‌బెర్రీ అనే ఈ మహిళ, తన అద్భుత ప్రతిభతో 10,000 డాలర్ల (సుమారు రూ. 8.3 లక్షలు) గ్రాండ్ ప్రైజ్‌ను గెలుచుకుంది. ఆమె ప్రదర్శించిన ధైర్యసాహసాలకు 'ఎవర్‌గ్లేడ్స్ క్వీన్'గా ప్రశంసలు అందుకుంటోంది.

ఫ్లోరిడాలోని ఎవర్‌గ్లేడ్స్ పర్యావరణ వ్యవస్థకు పెను ముప్పుగా మారిన బర్మీస్ కొండచిలువల సంఖ్యను తగ్గించేందుకు ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ కన్సర్వేషన్ కమిషన్ (ఎఫ్‌డబ్ల్యూసీ) ఏటా ఈ పోటీని నిర్వహిస్తోంది. జులై 11 నుంచి 20 వరకు జరిగిన ఈ ఏడాది పోటీలో అమెరికాలోని 30 రాష్ట్రాలు, కెనడా నుంచి మొత్తం 934 మంది పాల్గొన్నారు. వారంతా కలిసి ఈ పోటీలో 294 కొండచిలువలను తొలగించారు. ఇందులో సింహభాగం టేలర్ స్టాన్‌బెర్రీ ఒక్కరే పట్టుకోవడం విశేషం.

ఆగ్నేయాసియాకు చెందిన ఈ బర్మీస్ కొండచిలువులు, పెంపుడు జంతువుల వ్యాపారం ద్వారా ఫ్లోరిడాకు చేరి అక్కడి పర్యావరణానికి హానికరంగా మారాయి. ఇవి ఒకేసారి 50 నుంచి 100 గుడ్లు పెట్టగలవు. వీటి వల్ల స్థానిక జీవజాలానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ ముప్పును నివారించేందుకే ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఎఫ్‌డబ్ల్యూసీ ఈ ఛాలెంజ్‌ను నిర్వహిస్తోంది. పోటీలో పాల్గొనేవారు ఆన్‌లైన్‌లో శిక్షణ పొంది, తుపాకులు వంటి ఆయుధాలు వాడకుండా మానవతా పద్ధతుల్లో కొండచిలువలను పట్టుకోవాల్సి ఉంటుంది.

ఈ సందర్భంగా ఎఫ్‌డబ్ల్యూసీ ఛైర్మన్ రోడ్నీ బారెటో మాట్లాడుతూ, "ఈ ఛాలెంజ్ ద్వారా ఇప్పటివరకు 1,400కు పైగా కొండచిలువలను తొలగించాం. 2017 నుంచి మా కాంట్రాక్టర్ల ద్వారా మరో 16,000 పైథాన్లను పట్టుకున్నాం" అని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంత కీలకమో ఈ పోటీ నిరూపిస్తోందని ఆయన అన్నారు.
Taylor Stanberry
Florida python challenge
Burmese pythons
Everglades National Park
python hunting
Florida Fish and Wildlife Conservation Commission
FWC
invasive species
wildlife conservation
python removal

More Telugu News