DK Shivakumar: ధర్మస్థలపై కుట్ర త్వరలోనే బయటకు వస్తుంది.. ఆరోపణలు రుజువు కాకపోతే కఠిన చర్యలు తప్పవు: డీకే శివకుమార్

DK Shivakumar Warns of Action if Dharmasthala Allegations Unproven
  • ధర్మస్థలలో సామూహిక ఖననం కేసు
  • పుణ్యక్షేత్ర ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందన్న శివకుమార్
  • ప్రజల డిమాండ్ మేరకు సిట్ ఏర్పాటు చేశామని వెల్లడి
కర్ణాటకలోని ధర్మస్థలలో సామూహిక ఖననం కేసుపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మస్థల పుణ్యక్షేత్ర ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని చెప్పారు. త్వరలోనే ధర్మస్థలపై జరగుతున్న కుట్ర బయటకు వస్తుందని అన్నారు. ఈ అంశంపై చేసిన ఆరోపణలు రుజువుకాని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

ధర్మస్థలకు అనుకూలంగానో లేదా వ్యతిరేకంగానో తాను మాట్లాడటం లేదని శివకుమార్ చెప్పారు. చట్టానికి ఎవరూ అతీతం కాదని... చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవిస్తారని చెప్పారు. ఈ అంశంపై హోం మంత్రి పరమేశ్వర సోమవారం అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేస్తారని తెలిపారు. ఆ ప్రాంత ప్రజల డిమాండ్ మేరకు సిట్ ఏర్పాటు చేసి, విచారణకు ఆదేశించామని శివకుమార్ చెప్పారు. సిట్ దర్యాప్తుకు కాలపరిమితి ఉంటుందని... ఈలోపు సిట్ దర్యాప్తుకు భంగం కలిగించేలా వ్యవహరించకూడదని భావిస్తున్నామని అన్నారు. 

1995-2014 మధ్య తాను పనిచేస్తున్న సమయంలో ధర్మస్థల ఆలయ నిర్వాహకుల ఆదేశాల మేరకు మృతదేహాలను పాతిపెట్టినట్టు 61 ఏళ్ల ఓ వ్యక్తి ఆరోపించాడు. ఆ ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసినట్టు చెబుతున్న ఆ వ్యక్తి... వందల సంఖ్యలో మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశారని చెప్పాడు. అందులో మహిళలు, మైనర్ బాలికల మృతదేహాలు అధికంగా ఉన్నాయని... కొందరిపై లైంగికదాడి జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం కూడా ఇచ్చాడు. వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తికి సిట్ రక్షణ కూడా కల్పిస్తోంది. 


DK Shivakumar
Karnataka
Dharmasthala
Mass Burial Case
Conspiracy
SIT Investigation
Home Minister Parameshwara
Temple
Allegations
Justice

More Telugu News