Anjamma: శ్రీశైలం సమీపంలో దారుణం.. నిద్రిస్తున్న చిన్నారిని లాక్కెళ్లిన చిరుత.. వెంటాడి కాపాడిన తల్లిదండ్రులు

Leopard attack near Srisailam Parents save 3 year old Anjamma
  • చెంచుగూడెంలో మూడేళ్ల చిన్నారిపై చిరుత దాడి
  • పాపను నోటకరచుకుని పొదల్లోకి లాక్కెళ్లేందుకు యత్నం
  • అప్రమత్తమైన తల్లిదండ్రులు, గ్రామస్థులు
  • చిరుతను వెంటాడి పాపను రక్షించిన పోలీసులు
  •  చిన్నారి తల, పొట్టకు తీవ్ర గాయాలు.. ఆసుపత్రిలో చికిత్స
తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారిని ఓ చిరుతపులి నోటకరచుకుని లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. గ్రామస్థులు, తల్లిదండ్రులు వెంటనే స్పందించి ప్రాణాలకు తెగించి ఆ చిన్నారిని కాపాడుకున్నారు. ఈ దాడిలో పాపకు తీవ్ర గాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళితే.. పెద్దదోర్నాల మండలం, శ్రీశైలానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నారుట్ల చెంచుగూడేనికి చెందిన కుడుముల అంజయ్య, లింగేశ్వరి దంపతులు తమ మూడేళ్ల కుమార్తె అంజమ్మతో కలిసి బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన చిరుత, వారి పక్కనే నిద్రిస్తున్న చిన్నారి అంజమ్మ తలను నోట కరుచుకుని నెమ్మదిగా బయటకు ఈడ్చుకెళ్లింది.

చిన్నారి ఏడవడంతో తల్లిదండ్రులు ఉలిక్కిపడి లేచారు. కళ్లెదురుగా చిరుత తమ బిడ్డను లాక్కెళ్లడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే తేరుకుని కర్రలు చేతపట్టుకుని కేకలు వేస్తూ చిరుతను వెంబడించారు. వారి అరుపులకు గూడెం వాసులు కూడా మేల్కొని వెంటపడ్డారు. జనాలను చూసి భయపడిన చిరుత, కొంత దూరంలో పాపను పొదల్లో వదిలేసి అడవిలోకి పారిపోయింది.

ఈ ఘటనలో చిన్నారి తల, పొట్ట భాగాల్లో తీవ్రమైన గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే పాపను సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న ఎస్ఐ మహేశ్ ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారిని, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం పాపను దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన గూడెం వాసులు, తమ గ్రామానికి విద్యుత్ సౌకర్యం లేకపోవడం వల్లే వన్యప్రాణుల దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ గురువారం దోర్నాల-శ్రీశైలం ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న అటవీ, పోలీస్ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. గూడేనికి విద్యుత్ సరఫరా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
Anjamma
Srisailam
cheetah attack
child injured
Prakasam district
Andhra Pradesh
forest attack
Chenchu Goodem
Dornala
wildlife

More Telugu News