PM Modi: ఎర్రకోట నుంచి పాకిస్థాన్‌కు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్..!

India Wont Tolerate Nuclear Blackmail PM Modis Big Message To Pakistan
  • 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం
  • ఎర్రకోటపై వరుసగా 12వ సారి జాతీయ జెండా ఆవిష్కరణ
  • పాకిస్థాన్ అణు బెదిరింపులను సహించబోమంటూ తీవ్ర హెచ్చరిక
  • సింధు జలాల ఒప్పందాన్ని భారత్ అంగీకరించబోదని స్పష్టీకరణ
  • పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలోనే ఈ నిర్ణయమని వెల్లడి
  • భారత రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న ప్రధాని
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ, పొరుగుదేశం పాకిస్థాన్‌కు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్థాన్ నుంచి వస్తున్న అణు బెదిరింపులను భారత్ ఎంతమాత్రం సహించబోదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో, దశాబ్దాలుగా అమల్లో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని ఇకపై భారత్ అంగీకరించబోదని సంచలన ప్రకటన చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై వరుసగా 12వ సారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధాని మాట్లాడారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. "నీళ్లు, రక్తం ఎప్పటికీ కలిసి ప్రవహించవు" అని పునరుద్ఘాటించారు. మన దేశానికి చెందిన నీటిని పాకిస్థాన్‌తో పంచుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

"మన భూములు దాహంతో అల్లాడుతుంటే, శత్రువుల నేలలను తడపడానికి మన నీటిని వాడుకున్నారు. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. భారతదేశానికి చెందిన నీటిపై మనకు, మన రైతులకు పూర్తి హక్కు ఉంటుంది. దేశ, రైతుల సంక్షేమం కోసం సింధు జలాల ఒప్పందాన్ని మేం అంగీకరించడం లేదు" అని ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా తేల్చిచెప్పారు.

ఈ స్వాతంత్ర్య దినోత్సవం 140 కోట్ల మంది భారతీయుల సంకల్పాలకు ప్రతీక అని మోదీ అభివర్ణించారు. దేశం సాధించిన సమిష్టి విజయాలను చూసి గర్వపడాల్సిన తరుణమిదని అన్నారు. ఎడారులు, హిమాలయ శిఖరాలు, సముద్ర తీరాలు అనే తేడా లేకుండా దేశంలోని ప్రతి మూల నుంచి ఒకే నినాదం వినిపిస్తోందని, అదే ప్రాణం కంటే ప్రియమైన మాతృభూమి గీతమని పేర్కొన్నారు. గత 75 ఏళ్లుగా భారత రాజ్యాంగం మనకు మార్గనిర్దేశం చేస్తోందని గుర్తుచేశారు. "వికసిత భారత్" నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ మరింత కష్టపడి పనిచేయాలని ఈ సంద‌ర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
PM Modi
India
Pakistan
Independence Day
Red Fort
Indus Waters Treaty
water sharing
nuclear threats
Kashmir
Pahalgam attack

More Telugu News