Kapil Dev: ఆ మూగజీవాలకు మంచి జీవితం ఇవ్వండి.. వీధి కుక్కల కోసం కపిల్ దేవ్ భావోద్వేగ పిలుపు

Give Stray Dogs A Better Life Kapil Devs Request Amid Controversy
  • వీధి కుక్కల తరలింపుపై స్పందించిన భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్
  • సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కపిల్ దేవ్ వీడియో సందేశం
  • కుక్కకాటుతో పిల్లలు చనిపోతున్నారని కోర్టులో ప్రభుత్వ వాదన
  • కోర్టు తీర్పుపై జంతు ప్రేమికుల నుంచి వెల్లువెత్తుతున్న నిరసనలు
దేశ రాజ‌ధాని ఢిల్లీలో వీధికుక్కలను షెల్టర్ హోమ్‌లకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ స్పందించాడు. మూగజీవాల పట్ల కరుణ చూపాలని, వాటికి మెరుగైన జీవితాన్ని అందించాలని అధికారులను ఆయన కోరాడు.

జంతు సంక్షేమ సంస్థ 'పెట్‌ఫ్యామిలియా' ద్వారా విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో కపిల్ దేవ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. "కుక్కల గురించి చాలా రకాల మాటలు వినిపిస్తున్నాయి. కానీ ఒక పౌరుడిగా, అవి చాలా అందమైన జీవాలని నేను భావిస్తున్నాను. దయచేసి అధికారులు వాటిపై దృష్టి పెట్టి, మెరుగైన జీవితాన్ని ఇవ్వండి. వాటిని బయటకు విసిరేయొద్దు" అని క‌పిల్‌ విజ్ఞప్తి చేశాడు.

ఢిల్లీలో వీధికుక్కలను బహిరంగ ప్రదేశాల నుంచి తొలగించి, షెల్టర్ హోమ్‌లకు తరలించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఆగస్టు 11న జస్టిస్ జె.బి. పార్థీవాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇవ్వగా, దీనిపై జంతు ప్రేమికుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. తీర్పు కాపీ అధికారికంగా విడుదల కాకముందే అధికారులు కుక్కలను పట్టుకోవడంపై మరో ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

మరోవైపు, ఈ కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కీలక వాదనలు వినిపించారు. కుక్కకాటు వల్ల పిల్లలు చనిపోతున్నారని, రేబిస్ వ్యాధి వ్యాపిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది దేశవ్యాప్తంగా 37 లక్షల కుక్కకాటు కేసులు నమోదయ్యాయని తెలిపారు. "స్టెరిలైజేషన్ చేయడం వల్ల రేబిస్ ఆగదు. ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాలి" అని ఆయన ధర్మాసనానికి విన్నవించారు. 
Kapil Dev
Stray Dogs
animal welfare
Delhi
Supreme court
dog bites
rabies
stray animals
PetFamilia

More Telugu News