United States: పాకిస్థాన్ లోని కీలక సహజ వనరులపై కన్నేసిన అమెరికా!

United States eyes key natural resources in Pakistan
  • కీలక ఖనిజాలు, హైడ్రోకార్బన్ల రంగంలో పాక్‌తో సహకారానికి అమెరికా ఆసక్తి
  • పాక్ స్వాతంత్ర్య దినోత్సవం నాడు అమెరికా విదేశాంగ మంత్రి ప్రకటన
  • గతంలో పాక్ చమురు నిల్వలపై కన్నేసిన అధ్యక్షుడు ట్రంప్
  • పాక్‌లో చమురు నిల్వలు చాలా తక్కువని స్పష్టం చేస్తున్న నివేదికలు
  • భారత్‌తో పోలిస్తే పాక్‌పై అమెరికా తక్కువ సుంకాలు విధించడంపై చర్చ
దక్షిణాసియాలో తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం అమెరికా మరోసారి పాకిస్థాన్‌ వైపు దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. పాకిస్థాన్‌లోని సహజ వనరులు, ముఖ్యంగా కీలక ఖనిజాలు, హైడ్రోకార్బన్‌ల వెలికితీతలో సహకరించేందుకు అమెరికా ఆసక్తి చూపడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా చేసిన ప్రకటన, అగ్రరాజ్య అసలు లక్ష్యాలకు అద్దం పడుతోంది.

పాకిస్థాన్ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా (ఆగస్టు 14) ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఆర్థిక సహకారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. "కీలక ఖనిజాలు, హైడ్రోకార్బన్‌ల వంటి కొత్త రంగాల్లో ఆర్థిక సహకార అవకాశాలను అన్వేషించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఇరు దేశాల ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం వ్యాపార భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తాం" అని ఆయన తన సందేశంలో స్పష్టం చేశారు. 

అయితే, పాక్ సహజ వనరులపై అమెరికా ఆసక్తి చూపడం ఇదే మొదటిసారి కాదు. కొంతకాలం కిందటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్‌లోని చమురు నిల్వలపై దృష్టి సారించారు. పాక్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరిందని, ఆ దేశంలోని చమురు నిల్వల అభివృద్ధికి ఓ అమెరికన్ కంపెనీని ఎంపిక చేసే ప్రక్రియలో ఉన్నామని ట్రంప్ తెలిపారు. భవిష్యత్తులో పాకిస్థాన్... భారత్‌కు చమురు విక్రయించే స్థాయికి ఎదుగుతుందని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు.

కానీ, వాస్తవ గణాంకాలు ట్రంప్ వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రపంచ చమురు నిల్వల్లో పాకిస్థాన్ వాటా కేవలం 0.02 శాతం మాత్రమే. రాయిటర్స్ నివేదిక ప్రకారం, పాక్‌లో చమురు నిల్వలు 234 మిలియన్ల నుంచి 353 మిలియన్ బ్యారెళ్ల మధ్య ఉన్నాయి. ఈ లెక్కన ప్రపంచంలో పాక్ 50వ స్థానంలో ఉంది. ఈ స్వల్ప నిల్వలతో పాకిస్థాన్ గణనీయమైన చమురు ఎగుమతిదారుగా మారే అవకాశం దాదాపు అసాధ్యం.

మరోవైపు, వాణిజ్య విషయంలో ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై కఠినంగా వ్యవహరిస్తూ, పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉండటం గమనార్హం. దక్షిణాసియాలో పాక్ వస్తువులపై కేవలం 19 శాతం సుంకం విధిస్తుండగా, భారత్‌పై 25 శాతం సుంకం విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అదనంగా మరో 25 శాతం సుంకం విధించడంతో భారత్‌పై మొత్తం సుంకం 50 శాతానికి చేరింది. అమెరికా నిర్ణయాన్ని భారత విదేశాంగ శాఖ "అన్యాయం, అసమంజసం" అని తీవ్రంగా విమర్శించింది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే, సహజ వనరుల కోసమే అమెరికా పాకిస్థాన్‌కు దగ్గరవుతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
United States
Pakistan
US Pakistan relations
Pakistan natural resources
Marco Rubio
Pakistan oil reserves
South Asia
critical minerals
hydrocarbons
Donald Trump

More Telugu News