Basit Ali: భారత జట్టు మాతో ఆడకుంటే మా పరువు నిలబడుతుంది.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

Basit Ali Comments on India Not Playing Pakistan in Asia Cup
  • విండీస్ చేతిలో పాకిస్థాన్ దారుణ ఓటమి
  • పాక్ ఓటమిపై మాజీ క్రికెటర్ల విమర్శలు
  • ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై భారత జట్టు ఆడకూడదని ప్రార్థిస్తున్నట్టు చెప్పిన బసిత్ అలీ
  • పాక్‌తో ఆడేందుకు బీసీసీఐ నిరాకరించాలని కోరుకుంటున్నట్టు చెప్పిన మాజీ
ఆసియా కప్‌లో భారత జట్టు మాతో ఆడకపోతేనే తమ పరువు నిలుస్తుందని పాక్ క్రికెటర్ బసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్ చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్ దారుణంగా ఓడిపోయింది. 295 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఆ జట్టు కేవలం 92 పరుగులకే కుప్పకూలింది. దీంతో సిరీస్‌ను 2-1 తేడాతో వెస్టిండీస్ కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో సులభంగా గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచిన మహ్మద్ రిజ్వాన్ జట్టు, ఆ తర్వాత రెండు మ్యాచ్‌లలో ఘోరంగా విఫలమైంది.

ఈ ఘోర ఓటమిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు తీవ్రంగా స్పందించారు. షోయబ్ అక్తర్ పాక్ బ్యాటింగ్ లైనప్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మరో మాజీ క్రికెటర్ బసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్, పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న రాజకీయ, దౌత్య ఉద్రిక్తతల మధ్య జరగనున్న ఆసియా కప్‌ గురించి మాట్లాడుతూ.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడేందుకు బీసీసీఐ నిరాకరించాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పాడు. అలా చేస్తే పాకిస్థాన్ జట్టు పరువు పోకుండా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

"వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో భారత్ ఎలాగైతే పాకిస్థాన్‌తో ఆడటానికి నిరాకరించిందో, అదే విధంగా ఆసియా కప్‌లో కూడా భారత్ మాతో ఆడటానికి నిరాకరించాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. వాళ్లు మమ్మల్ని ఎంత దారుణంగా ఓడిస్తారో మీరు ఊహించలేరు" అని బసిత్ అలీ 'ది గేమ్ ప్లాన్' యూట్యూబ్ చానెల్‌తో చెప్పాడు.

దీనిపై హోస్ట్ నవ్వుతూ, ఈ పరిస్థితిలో ఆఫ్ఘనిస్థాన్ జట్టును కూడా పాకిస్థాన్ ఓడించలేదని వ్యాఖ్యానించారు. దీనికి బసిత్ స్పందిస్తూ "ఒకవేళ ఆఫ్ఘనిస్థాన్ చేతిలో ఓడినా ఎవరూ పట్టించుకోరు. కానీ భారత్‌తో ఓడిపోతే మాత్రం అందరూ పిచ్చివాళ్లలా ప్రవర్తిస్తారు" అని అన్నాడు. 
Basit Ali
Pakistan cricket
Asia Cup
BCCI
India vs Pakistan
Pakistan vs West Indies
Shoaib Akhtar
Mohammad Rizwan
cricket
Asia Cup 2024

More Telugu News