Lakshmi Siva Jyothi: బుడమేరుకు మళ్లీ వరదలంటూ వార్తలు... జిల్లా కలెక్టర్ క్లారిటీ

Collector Lakshmi Siva Jyothi clarifies on Budameru flood rumors
  • ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు
  • విజయవాడలోని పలు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీరు
  • బుడమేరుకు వరద అంటూ పుకార్లు 
  • వదంతులు నమ్మవద్దన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. విజయవాడలో పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. ఈ క్రమంలో బుడమేరుకు వరద వస్తుందంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో విజయవాడ పట్టణంలోని పలు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఈ వదంతులపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ స్పందిస్తూ, బుడమేరుకు వరద అంటూ వచ్చే వదంతులను ప్రజలు నమ్మవద్దని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో బుడమేరులో ప్రవాహంపై వెలగలేరు రెగ్యులేటర్ వద్ద ప్రత్యేక బృందం నిరంతరం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు. స్థానికంగా కురిసిన వర్షం వల్లనే విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో అక్కడక్కడ నీరు నిలిచిందే కానీ, దానికి బుడమేరు వరద కారణం కాదని స్పష్టం చేశారు.

వెలగలేరు రెగ్యులేటర్ వద్ద నీరు విడుదల చేస్తే 24 గంటల ముందే ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు. బుడమేరు పరివాహక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన తర్వాతనే నీటి విడుదల జరుగుతుందని తెలిపారు. ఏదైనా సందేహాలు ఉంటే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 9154970454 నంబర్‌కు కాల్ చేసి పరిస్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రజలు పుకార్లు నమ్మకుండా ధైర్యంగా, అప్రమత్తతతో ఉండాలని కలెక్టర్ సూచించారు. 
Lakshmi Siva Jyothi
NTR district
Vijayawada floods
Budameru river
Collector Lakshmi Siva Jyothi
Andhra Pradesh rains
Velagaleru regulator
AP weather
flood alert
heavy rainfall

More Telugu News