Amit Malviya: భారత పౌరసత్వం రాకముందే ఓటరు జాబితాలో సోనియా పేరు చేర్చారు: బీజేపీ నేత మాలవీయ

Amit Malviya Says Sonia Gandhi Name in Voter List Before Citizenship
  • 1980 నాటి ఢిల్లీ ఓటర్ల జాబితాను బయటపెట్టిన మాలవీయ
  • ఆ జాబితాలో సోనియా పేరు ఉందని వెల్లడి
  • 1983లో సోనియాకు పౌరసత్వం వచ్చిందన్న మాలవీయ
కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తూ ఓట్లను తొలగిస్తోందని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని లక్ష్యంగా చేసుకుని బీజేపీ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆమెకు భారత పౌరసత్వం లభించక ముందే, ఢిల్లీ ఓటర్ల జాబితాలో ఆమె పేరు నమోదైందని ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాలవీయ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆధారాలను బయటపెట్టడం జాతీయ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. 1980 నాటి ఢిల్లీ ఓటర్ల జాబితాకు సంబంధించిన ఒక చిత్రాన్ని ఆయన 'ఎక్స్' లో పోస్ట్ చేశారు. ఆ జాబితాలో సోనియా గాంధీ పేరు స్పష్టంగా ఉందని, ఒక విదేశీ పౌరురాలికి ఇది ఎలా సాధ్యమైందని ఆయన ప్రశ్నించారు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని, తీవ్రమైన తప్పిదమని ఆయన పేర్కొన్నారు.

వాస్తవానికి, ఇటలీలో జన్మించిన సోనియా గాంధీ 1968లో రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 1983 ఏప్రిల్ 30న ఆమె భారత పౌరసత్వాన్ని అధికారికంగా స్వీకరించారు. అయితే, పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే, అంటే 1980లోనే ఆమె పేరు ఓటర్ల జాబితాలో చేరడంపై మాలవీయ సందేహాలు వ్యక్తం చేశారు.

"ఒక ఇటలీ పౌరురాలి పేరును భారత ఓటర్ల జాబితాలో ఎలా చేర్చారు? అప్పటి ప్రభుత్వం ఒత్తిడితో ఇది జరిగిందా? లేక గాంధీ కుటుంబం మోసపూరితంగా ఈ పని చేసిందా?" అని మాలవీయ వరుస ప్రశ్నలు సంధించారు. ఈ మొత్తం వ్యవహారంపై గాంధీ కుటుంబంతో పాటు, నాటి ఎన్నికల సంఘం అధికారులు కూడా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కొత్త ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడగా, దీనిపై ఆ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.  
Amit Malviya
Sonia Gandhi
Indian citizenship
voter list
BJP IT cell
Congress party
Delhi voter list 1980
Rajiv Gandhi
Italian citizen
election commission

More Telugu News