Mohammed Siraj: సిరాజ్ మ్యాచ్ విన్నింగ్ బాల్‌పై అంపైర్ కుమార ధర్మసేన పోస్ట్ వైరల్

Mohammed Siraj Match Winning Ball Umpire Kumar Dharmasena Viral Post
  • సిరాజ్ బౌలింగ్‌ను దగ్గరుండి చూడటం అదృష్టమన్న అంపైర్ ధర్మసేన
  • ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన మహ్మద్ సిరాజ్
  • ఏకంగా 12 స్థానాలు మెరుగుపరుచుకుని 15వ ర్యాంకు కైవసం
  • ఇంగ్లండ్‌తో చివరి టెస్టులో అద్భుత ప్రదర్శనతో కెరీర్ బెస్ట్ ర్యాంక్
  • సిరీస్‌లో 23 వికెట్లతో భారత బౌలర్లలో అగ్రస్థానం
  • సిరీస్‌లోని ఐదు టెస్టులూ ఆడిన ఏకైక భారత బౌలర్
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌ను అందుకున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన సిరాజ్, తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో సంచలనం సృష్టించాడు. నేడు విడుదలైన ఈ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 12 స్థానాలు ఎగబాకి 15వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 674 రేటింగ్ పాయింట్లతో సిరాజ్ తన టెస్ట్ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంకును నమోదు చేయడం విశేషం.

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 2-2తో సమంగా ముగియడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఓవల్ మైదానంలో జరిగిన చివరి టెస్టులో అతని ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. మ్యాచ్ చివరి రోజు ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు అవసరం కాగా, భారత్‌కు నాలుగు వికెట్లు కావాలి. ఈ ఉత్కంఠభరిత సమయంలో ప్రసిద్ధ్ కృష్ణతో కలిసి సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్‌ను కట్టడి చేశాడు.

ఇంగ్లండ్ విజయానికి కేవలం ఏడు పరుగులు అవసరమైన దశలో, చేతిలో ఒకే వికెట్ ఉంది. ఈ స్థితిలో బౌలింగ్‌కు వచ్చిన సిరాజ్, తొలి బంతికే అట్కిన్సన్ ఆఫ్ స్టంప్‌ను ఎగరగొట్టి భారత్‌కు ఆరు పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఆ అద్భుతమైన బంతికి మైదానంలో అంపైర్‌గా ఉన్న శ్రీలంకకు చెందిన కుమార్ ధర్మసేన సైతం ఫిదా అయ్యారు. "అత్యంత సమీపం నుంచి ఆ బంతిని చూసే అదృష్టం నాకు దక్కింది" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి సిరాజ్‌ను ప్రశంసించారు.

ఈ సిరీస్‌లో స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పనిభారం కారణంగా కేవలం మూడు టెస్టులకే పరిమితమయ్యాడు. ఆ సమయంలో పూర్తి బాధ్యతను తన భుజాలపై వేసుకున్న సిరాజ్, సిరీస్‌లోని ఐదు మ్యాచ్‌లూ ఆడిన ఏకైక భారత బౌలర్‌గా నిలిచాడు. మొత్తం 185 ఓవర్లకు పైగా బౌలింగ్ చేసి 23 వికెట్లు పడగొట్టి, భారత బౌలర్లలో అగ్రస్థానంలో నిలిచి తన సత్తా చాటాడు.
Mohammed Siraj
Siraj
Kumar Dharmasena
India vs England
Test Series
ICC Rankings
Jasprit Bumrah
Oval Test
Cricket
Indian Bowler

More Telugu News