Chandrababu Naidu: అమెరికా చర్యలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu Naidu Reacts to US Comments on Economy
  • మోదీ రూపంలో దేశానికి సమర్థ నాయకత్వం ఉందన్న సీఎం చంద్రబాబు
  • భారత్‌ది డెడ్ ఎకానమీ కాదు…గుడ్ ఎకానమీ అన్న చంద్రబాబు
  • మన వారికి ఉద్యోగాలు ఇవ్వని దేశాలు అభివృద్ధి చెందలేవన్న చంద్రబాబు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన ఆర్థిక వ్యవస్థను 'డెడ్ ఎకానమీ' అన్నారని, ఎవరి ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీనో భవిష్యత్తు నిర్ణయిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మనపై సుంకాలు విధించడం ద్వారా అమెరికా సృష్టించేది తాత్కాలిక ఇబ్బందులు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. మనది బలమైన ఆర్థిక వ్యవస్థ అని ఆయన స్పష్టం చేశారు. భారతీయుల సేవలు ప్రపంచానికి ఎంతో అవసరమని, మన వారికి ఉద్యోగాలు ఇవ్వని దేశాలు అభివృద్ధి చెందలేవని ఆయన అన్నారు.

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిన్న నిర్వహించిన 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పింగళి వెంకయ్య జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు. ఏ జెండా చూస్తే ప్రతి భారతీయ పౌరుడి మనస్సు పులకరిస్తుందో, ఏ జెండా చూస్తే దేశం యావత్తు గర్వంగా తలెత్తుకుంటుందో, ఏ జెండా చూస్తే ఉద్వేగం కలుగుతుందో అదే మువ్వన్నెల జెండా అని ఆయన కొనియాడారు.

దేశ సమగ్రత విషయంలో భారత్ ఎవరికీ తలవంచదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దేశ క్షేమం, భద్రత విషయంలో మనమంతా ఒక్కటేనని, కార్గిల్ యుద్ధం, పహల్గామ్ ఘటన జరిగినప్పుడు దేశ ప్రజానీకం ఒక్క తాటిపై నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భారతదేశం విశ్వగురువుగా అవతరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదానికి గట్టిగా బదులిచ్చామని ఆయన అన్నారు.

ప్రధాని మోదీ రూపంలో మన దేశానికి సమర్థవంతమైన నాయకత్వం లభించిందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకప్పుడు మనది పేద దేశం అనేవారని, 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ 11 ఏళ్ల మోదీ పాలనలో  4వ స్థానానికి చేరుకుందని ఆయన అన్నారు. 2028 నాటికి 3వ స్థానానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 2047లో వందేళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకునే నాటికి ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశంగా మనదేశం నిలుస్తుందని, అదే క్రమంలో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు. 
Chandrababu Naidu
Andhra Pradesh
AP CM
America
Trump
Indian economy
Har Ghar Tiranga
India
Narendra Modi
Economic growth

More Telugu News