TCS: వచ్చే రెండుమూడేళ్లలో భారత్‌లో 5 లక్షల మంది ఐటీ ఉద్యోగులపై వేటు

TCS Layoffs Signal AI Impact 5 Lakh Indian IT Jobs at Risk
  • 12,200 మందిని తొలగిస్తున్న టీసీఎస్
  • నైపుణ్యాల లేమితో ఉద్యోగాలు కోల్పోతున్న వారే అధికం
  • ఏఐ తీసుకొస్తున్న పెను మార్పులకు సంకేతమంటున్న నిపుణులు
  • ప్రమాదంలో  13-25 ఏళ్ల అనుభవం ఉన్న 4.3 లక్షల మంది
  • నైపుణ్యాలను మార్చుకోవడానికి ఇష్టపడనివారు వెనకబడిపోతారన్న టెక్ మహీంద్రా మాజీ సీఈవో సీపీ గుర్నానీ 
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన మిడిల్, సీనియర్ మేనేజ్‌మెంట్ పొజిషన్స్‌లో 12,200 మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇది ఆ సంస్థ మొత్తం ఉద్యోగుల్లో రెండు శాతానికి సమానం. ఈ తొలగింపుకు నైపుణ్యాల లేమిని కారణంగా చెబుతున్నప్పటికీ, ఇది భారత ఐటీ సేవల రంగంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తీసుకొస్తున్న పెను మార్పులకు తొలి సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒకప్పుడు పెద్ద బృందాలు చేసే సాధారణ కోడింగ్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, కస్టమర్ సపోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ వంటి పనులను ఇప్పుడు ఏఐ చేస్తోంది. పరిశ్రమ విశ్లేషకుల అంచనా ప్రకారం రాబోయే రెండు నుంచి మూడు సంవత్సరాలలో 4 నుంచి 5 లక్షల ఐటీ ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉంది. ఆటోమేషన్ కారణంగా ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలు అవసరమవుతున్న నేపథ్యంలో చాలామందిలో అవి కొరవవడడంతో ఉద్యోగులపై వేటు తప్పడం లేదు. 

స్టాఫింగ్ డేటా ప్రకారం 13 నుంచి 25 సంవత్సరాల అనుభవం ఉన్న 4,30,000 మంది భారతీయ ఐటీ నిపుణులు ప్రమాదంలో ఉన్నారు. వీళ్లలో ముఖ్యంగా సాంకేతిక నైపుణ్యం లేని టీమ్ మేనేజర్లు, సాఫ్ట్‌వేర్ టెస్టర్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ సిబ్బంది ఉన్నారు. ఈ ఉద్యోగ కోతల ప్రభావం దాదాపు 70 శాతం 4 నుంచి 12 సంవత్సరాల అనుభవం ఉన్న వారిపైనే పడుతుందని నిపుణులు చెబుతున్నారు.  భారత జీడీపీలో ఐటీ రంగం వాటా 7 శాతం కన్నా ఎక్కువ. ఇది లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు కల్పిస్తోంది. ఈ భారీ ఉద్యోగ కోతలు వినియోగదారుల ఖర్చులను, పెట్టుబడులను, ఆర్థిక వృద్ధిని తీవ్రంగా ప్రభావితం చేయవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

6.13 లక్షల ఉద్యోగులు ఉన్న టీసీఎస్ ఏఐలో పెట్టుబడులు పెడుతూ కొత్త మార్కెట్లలోకి ప్రవేశిస్తోంది. ఫలితంగా భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్నామని చెబుతోంది. అయితే, మధ్య స్థాయి ఉద్యోగాలు కోల్పోయినవారు కొత్త ఉద్యోగాలను కనుక్కోవడం కష్టంగా ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే, మార్కెట్ ఇప్పుడు అధునాతన డిజిటల్, ఏఐ నైపుణ్యాలున్న వారిని మాత్రమే కోరుకుంటోంది. నైపుణ్యాలను మార్చుకోవడానికి ఇష్టపడనివారు వెనకబడిపోతారని టెక్ మహీంద్రా మాజీ సీఈవో సీపీ గుర్నానీ హెచ్చరిస్తున్నారు.  
TCS
Tata Consultancy Services
IT layoffs India
Indian IT sector
Artificial Intelligence
AI impact on jobs
IT job cuts
IT skills gap
automation
CP Gurnani

More Telugu News