Asim Munir: 'ఇండియా మెర్సిడెస్.. పాకిస్థాన్‌ డంప్ ట్రక్' అన్న పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై ట్రోలింగ్!

Asim Munir Trolled for Comparing India to Mercedes and Pakistan to Dump Truck
  • ఫ్లోరిడాలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసిన అసీమ్ మునీర్
  • ఆయన ఉద్దేశానికి వ్యతిరేకంగా ఉన్న వ్యాఖ్యలు
  • సోషల్ మీడియాలో మునీర్‌ను ఆటాడుకుంటున్న నెటిజన్లు
పాకిస్థాన్ సైనిక చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతోంది. ఫ్లోరిడాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన భారతదేశాన్ని ‘మెరిసే మెర్సిడెస్’గా, పాకిస్థాన్‌ను ‘గ్రావెల్ నిండిన డంప్ ట్రక్’గా పోల్చారు. ఈ వ్యాఖ్యలు ఆయన ఉద్దేశానికి వ్యతిరేకంగా ఉండటంతో నెటిజన్లు ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు.

 "భారతదేశం హైవేపై ఫెరారీ లాంటి వేగంతో వెళ్తున్న మెరిసే మెర్సిడెస్, కానీ మేము గ్రావెల్ నిండిన డంప్ ట్రక్. ఒకవేళ ట్రక్ కారును ఢీకొంటే ఎవరు నష్టపోతారు?" అని ఆయన ప్రశ్నించారు. పాకిస్థాన్‌ను తక్కువ వేగంతో వెళ్తున్నప్పటికీ, శక్తిమంతమైన దేశమని చెప్పడం మునీర్ ఉద్దేశం కావొచ్చు. కానీ ఆయన ఉపయోగించిన పోలిక అందుకు విరుద్ధంగా ఉండటంతో నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటున్నారు. 

సోషల్ మీడియా యూజర్లు ఈ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. మునీర్ తెలియకుండానే భారతదేశం మెరుగైనదని ఒప్పుకున్నారని కామెంట్ చేస్తున్నారు. ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాలలోనూ పాక్ చీఫ్‌పై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. "మునీర్ చెప్పిన ఒకే ఒక్క నిజం ఏమిటంటే భారతదేశం మెర్సిడెస్, అతని దేశం ఒక డంప్ ట్రక్. మిగతాదంతా కేవలం భ్రమే" అని ఒక యూజర్ రాశాడు. "తమ వాస్తవికత ఏమిటో వారికి ఇప్పుడు అర్థమైంది. వారు ఒక డంప్ ట్రక్, అంతకు మించి ఏమీ కాదు. ఒక ఫెయిల్డ్ ఫీల్డ్ మార్షల్ తమ దేశం ఎంత దయనీయంగా ఉందో ఒప్పుకున్నారు" అని మరొకరు వ్యాఖ్యానించారు.

"ఆయన తన సొంత దేశాన్ని ఎందుకు అవమానిస్తున్నాడు?" అని మరొకరు ప్రశ్నించారు. ఇంకొందరు ఏఐను ఉపయోగించి మెర్సిడెస్, డంప్ ట్రక్ ఢీకొంటే ఏం జరుగుతుందో ఊహించి పోస్టులు చేశారు. "నేను మొదట చదివినప్పుడు ఇది జోక్ అనుకున్నాను. కానీ ఇది నిజం. పాకిస్థాన్‌కు అసీమ్ మునీర్ వంటి ఆర్మీ చీఫ్ నిజంగా అర్హులే" అని ఒక యూజర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. 
Asim Munir
Pakistan
India
Mercedes
Dump Truck
Trolling
Social Media
Pakistan Army Chief
Aseem Munir Remarks
India vs Pakistan

More Telugu News