KC Venugopal: పైలట్ల చాకచక్యంతో బతికిపోయాం.. ఎంపీ కేసీ వేణుగోపాల్

Air India flight incident MP KC Venugopal shares harrowing experience
  • సాంకేతిక సమస్య కారణంగా విమానం చెన్నైకి దారి మళ్లింపు
  • ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ఏటీసీ అనుమతి కోసం ఎదురుచూపులు
  • రెండు గంటల పాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టిందని వెల్లడి
  • తీరా ల్యాండ్ అవుతుండగా రన్ వే పై మరో విమానం కనిపించిందన్న ఎంపీ
వందలాది మంది ప్రయాణికులతో ఆదివారం రాత్రి తిరువనంతపురం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో విమానాన్ని అధికారులు చెన్నైకి దారి మళ్లించారు. చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అవుతుండగా భయానక అనుభవం ఎదురైందని ఆ విమానంలో ప్రయాణించిన కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. ప్రమాదం అంచుల వరకు వెళ్లి పైలట్ల చాకచక్యంతో ప్రాణాలతో బయటపడ్డామని పేర్కొన్నారు.

ఈ ఘటనపై ఆయన ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘ఎయిరిండియా విమానంలో నేను, మరికొంతమంది ఎంపీలు, వందల మంది ప్రయాణికులు ప్రమాదం అంచుల వరకు వెళ్లొచ్చాం. తిరువనంతపురంలో విమానం ఆలస్యంగా బయల్దేరింది. టేకాఫ్‌ అయిన కాసేపటికే కుదుపులు మొదలయ్యాయి. గంట ప్రయాణం తర్వాత విమానాన్ని చెన్నైకి మళ్లిస్తున్నామని కెప్టెన్‌ ప్రకటించారు. చెన్నైలో ల్యాండింగ్ కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుంచి అనుమతి కోసం వేచి చూస్తూ రెండు గంటల పాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఎట్టకేలకు ఏటీసీ అనుమతినివ్వడంతో పైలట్ ల్యాండింగ్ కు ప్రయత్నించారు. చివరి నిమిషంలో అదే రన్ వే పైకి మరో విమానం రావడం చూసి మేమంతా తీవ్ర భయాందోళనకు గురయ్యాం. అయితే, పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి తిరిగి టేకాఫ్ చేశారు. రెండో ప్రయత్నంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు’’ అని పేర్కొన్నారు.

ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు జరిపించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డీజీసీఏ, కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖకు ఎంపీ కేసీ వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై ఎయిరిండియా స్పందిస్తూ.. ఈ అసౌకర్యానికి క్షమించాలని ప్రయాణికులను కోరింది. ప్రయాణికులను ఢిల్లీకి చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని వెల్లడించింది.
KC Venugopal
Air India
Chennai Airport
Flight Emergency Landing
Technical Issue
ATC
DGCA
Aviation Safety

More Telugu News